పోలవరం రూరల్: పోలవరం జల విద్యుత్ కేంద్రం పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఏపీ జెన్‌కో ఎండీ పి.పుల్లారెడ్డి ఆదేశించారు. పోలవరం నీటి పారుదల ప్రాజెక్ట్ పూర్తయ్యే సమయానికి జల విద్యుత్ కేంద్రం విద్యుత్ ఉత్పత్తికి సిద్ధం కావాలన్నారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని పనులు చేపట్టాలని నిర్మాణ సంస్థ ఎంఈఐఎల్‌కు సూచించారు. పనుల పురోగతిని అధికారులు నిత్యం పర్యవేక్షించాలని, అనుకున్న ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయో..? లేదో..? సమీక్షించాలన్నారు. బుధవారం పోలవరం జల విద్యుత్ కేంద్రం నిర్మాణ ప్రాంతాన్ని జెన్‌కో థర్మల్, హైడెల్ డైరెక్టర్స్ ఎం.సుజయ్‌కుమార్, పి.అశోక్‌కుమార్‌రెడ్డి, సివిల్ విభాగం చీఫ్ ఇంజినీర్ పి.రవీంద్రరెడ్డి, హెచ్‌పీసీ చీఫ్ ఇంజినీర్ ఎస్.విశ్వేశ్వరరావు, ఎస్‌ఈలు చంద్రశేఖర్, సి.హనుమ తదితరులతో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం జెన్‌కో అధికారులు, నిర్మాణ సంస్థ ఎంఈఐఎల్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. పోలవరం జల విద్యుత్ కేంద్ర నిర్మాణ పనుల్లో జాప్యం జరగకూడదన్నారు. తాను కూడా ప్రాజెక్ట్ పురోగతిని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. ప్రాజెక్ట్ నిర్మాణం సమయంలో ఏవైనా అవాంతరాలు ఎదురైతే వెంటనే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని తెలిపారు.
ఏపీ జెన్‌కో ఎండీ పుల్లారెడ్డి


