ఆరోగ్య కేంద్రాన్ని అందుబాటులోకి తేవాలి | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్య కేంద్రాన్ని అందుబాటులోకి తేవాలి

Mar 5 2026 7:36 AM | Updated on Mar 5 2026 7:36 AM

ఆరోగ్య కేంద్రాన్ని అందుబాటులోకి తేవాలి ఇంటర్‌ పరీక్షలకు 12,710 మంది హాజరు భూసేకరణ చట్ట విరుద్ధం బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయాలి

శాసనమండలిలో ఎమ్మెల్సీ రవీంద్రనాథ్‌

తణుకు అర్బన్‌: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో అర్బన్‌ ఆరోగ్య కేంద్రం ప్రజలకు వినియోగంలో లేకుండా పోయిందని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్‌ శాసనమండలి దృష్టికి తీసుకొచ్చారు. బుధవారం మండలిలో ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. 2023లో గత ప్రభుత్వ హయాంలో పూర్తి సౌకర్యలతో నిర్మించారని, కేవలం కరెంట్‌ కనెక్షన్‌ లేకపోవడంతో ఈ ఆరోగ్య కేంద్రం ప్రజలకు వినియోగంలోకి రాలేదని అన్నారు. ఈ సెంటర్‌ చుట్టుపక్కల సుమారుగా 25 వేల జనాభా ఉన్న కారణంగా గత ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ప్రతిపాదించి పని కూడా పూర్తి చేసిందని అన్నారు. ఆరోగ్య కేంద్రానికి కేటాయించిన ఆరోగ్య సిబ్బంది కూడా ఉన్నప్పటికీ ప్రజలకు వినియోగంలోకి తీసుకురాకపోవడం అధికారుల అలస్వతానికి నిదర్శనమన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల్లో భాగంగా బుధవారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు గణితం (ఏ), సివిక్స్‌ –2 పరీక్షలకు మొత్తం 12,710 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 56 పరీక్షా కేంద్రాల్లో జరిగిన పరీక్షకు జనరల్‌ విద్యార్థులు 11,025 మందికి 10,818 మంది హాజరు కాగా 207 మంది గైర్హాజరయ్యారు. 2028 మంది ఒకేషనల్‌ విద్యార్థులకు 1,892 మంది హాజరుకాగా 136 మంది గైర్హాజరయ్యారు.

కొయ్యలగూడెం: బహుళ పంటలు పండే భూములు భూసేకరణ చట్ట విరుద్ధమని, నేవీ ఆయుధ డిపో పేరుతో రైతుల భూములను బలవంతంగా లాక్కుంటే ప్రతిఘటన ఉద్యమం తప్పదని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌ రెడ్డి హెచ్చరించారు. బుధవారం కొయ్యలగూడెం మండలంలోని బోడిగూడెం, మంగపతిదేవి పేట, బర్కిట్‌ నగర్‌, ఊట్లగూడెం గ్రామాలలో పర్యటించి ప్రతిపాదిత నేవీ ఆయుధ డిపో ప్రాంతంలోని పంట పొలాలను రైతు సంఘం రాష్ట్ర నాయకుల బృందం పరిశీలించింది. ఆయా గ్రామాల రైతులతో రైతు సంఘం నాయకులు మాట్లాడారు. బలవంతపు భూ సేకరణ చేస్తే ప్రజలు, రైతులు ఇబ్బంది పడే సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ చట్ట విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించడం తగదన్నారు. 2013 భూ సేకరణ చట్ట ప్రకారం ప్రభుత్వ అవసరాలకు భూ సేకరణ చేస్తే 70 శాతం ప్రజల ఆమోదం తెలపాల్సి ఉందని చెప్పారు. రైతు సంఘం సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్‌, జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు, జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు తదితరులు మాట్లాడారు.

ఏలూరు (టూటౌన్‌): దివ్యాంగుల బ్యాక్‌ లాగ్‌ పోస్టులను తక్షణం భర్తీ చేయాలని నాయకులు డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా కమిటీ సమావేశం ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద కపర్ది భవనంలో సంఘ జిల్లా అధ్యక్షులు కుందేటి జయరాజు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు బండి వెంకటేశ్వర రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్‌.రాంబాబు మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి ఆందోళన చేయాలని కమిటీ సమావేశం తీర్మానించింది. ఏలూరులో దివ్యాంగుల సంక్షేమ భవనం నిర్మించాలని కోరారు. ఏఐటీయుసీ జిల్లా సహాయ కార్యదర్శి పి.కిషోర్‌, సంఘం కోశాధికారి జి భూలక్ష్మి, కొండపల్లి సురేష్‌ , పల్లెం వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement