టీడీపీ నేత.. రేషన్ బియ్యం మేత
● 210 బస్తాల బియ్యం, 342 కిలోల పంచదార బ్లాక్ మార్కెట్‌కు?
● రూ.6 లక్షలకుపైగా ప్రజాధనం లూటీ
● 6ఏ కేసుతో సరిపెట్టిన అధికారులు
తణుకు అర్బన్ : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందాల్సిన బియ్యాన్ని తణుకులో టీడీపీ మా జీ కౌన్సిలర్ బొక్కేసిన వ్యవహారం ఆలస్యంగా వె లుగు చూసింది. తణుకు పాతవూరు శివాలయం ప్రాంతంలోని 23వ నంబరు చౌకడిపోను తెరవకుండా విసుగు తెప్పించడంతో పాటు తెరిచినా గంటలోపు తలుపులు మూసివేయడం వంటి వ్యవహారంపై పలువురు కార్డుదారులు రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. అలాగే లబ్ధిదారులకు బియ్యం ఇవ్వకుండా కొందరితో వేలిముద్రలు వేయించుకుని, కొందరికి ఏ సమాధానం చెప్పకుండా డిపో మూసేసి సరుకును నేరుగా బియ్యం మాఫియాకు విక్రయిస్తున్న వ్యవహారం బట్టబయలైంది. బి య్యం, పంచదార రేషన్ డిపోలోనే ఉన్నట్టు ఆన్‌లైన్ లో సరుకు చూపిస్తుండటంతో రెవెన్యూ అధికారులకు చిర్రెత్తుకొచ్చింది. సదరు డిపోలో 105.75 క్వింటాళ్ల బియ్యం (సుమారు 210 బస్తాలు), 342 కిలోల పంచదార నిల్వలు తేడా గమనించి గత నెల లో డీలరుపై 6ఏ కేసు నమోదు చేసి మరో డిపో డీలర్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.
టీడీపీ వర్గమనే..
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాత డీలర్‌ను తొలగించి టీడీపీ మాజీ కౌన్సిలర్ అభ్యర్థన మేరకు ఈ డిపోను అతడి భార్య పేరున కేటాయించారు. రేషన్ షాపు పెత్తనమంతా సదరు మాజీ కౌన్సిలర్ చూడటం, తదితర సమస్యలపై నాలుగు నెలలుగా పలు ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే టీడీపీ నాయకుడు కావడంతో రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోలేని పరిస్థితి. అయినా మార్పు లేకపోవడంతో చివరకు కేసు నమోదు చేశారు. ఈ డిపో డ్వాక్రా గ్రూపునకు చెందిన వారికి కేటాయించిన డిపోగా తెలుస్తోంది.
బ్లాక్ మార్కెట్‌కు..
చౌక డిపో పరిధిలో 740 రేషన్ కార్డులు ఉండగా 30 శాతం కూడా సరుకులు పంపిణీ చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కార్డుదారులతో బయోమెట్రిక్ వేయించకుండానే బియ్యాన్ని బయట మార్కెట్‌కు తరలించారు. అయితే ప్రజా పంపిణీ వ్యవస్థ లాగిన్‌లో మాత్రం బియ్యం స్టాకు కనిపించేది. మొ త్తంగా 210 బస్తాల బియ్యానికి సంబంధించి రూ.6 లక్షలకు పైగా ప్రజాధనం లూటీ చేసినట్టు సమాచారం. దీనిపై తణుకు తహసీల్దార్ దండు అశోక్‌వర్మను ‘సాక్షి’ వివరణ కోరగా 23వ నంబరు చౌకడిపోపై పలు ఫిర్యాదులు వచ్చాయని, పరిశీలనలో 105.75 క్వింటాళ్ల బియ్యంతోపాటు 342 కిలోల పంచదార షార్టేజీ ఉండటంతో డీలరుపై 6ఏ కేసు నమోదు చేసి, తాత్కాలికంగా మరో డీలరును ఇన్‌చార్జిగా నియమించినట్టు చెప్పారు. అలాగే తణుకులో మరో ముగ్గురు డీలర్లు ఇదే తరహాలో డిపోను నడుపుతున్నారనే ఫిర్యాదులు వచ్చాయి.


