జోరుగా నల్ల బెల్లం విక్రయాలు
● సారా తయారీకి వినియోగం
● చింతలపూడికి టన్నుల కొద్దీ దిగుమతి
చింతలపూడి : ఏలూరు జిల్లాలో నల్ల బెల్లంతో పా టు సాధారణ బెల్లం అమ్మకాలు ఇటీవల గణనీయంగా పెరిగాయి. వ్యవసాయ అవసరాల పేరుతో విక్రయిస్తున్న నల్ల బెల్లం వాస్తవానికి సారా తయారీలో ప్రధాన ముడి పదార్థంగా మారుతోంది. ఈ అక్రమ వ్యాపారం వల్ల పేదల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
చిత్తూరు నుంచి భారీగా..
చింతలపూడిలో సారా తయారీకి ఉపయోగించే నల్ల బెల్లం అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. స్థానిక బెల్లం వ్యాపారులు కొందరు సిండికేట్‌గా మారి టన్నుల కొద్దీ బెల్లాన్ని చిత్తూరు జిల్లా నుంచి దిగుమతి చేసి విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. సారా తయారీకే ఈ బెల్లాన్ని వినియోగిస్తారని తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేసినా నామమాత్రపు దాడులు చేస్తూ బెల్లం వ్యాపారులకు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నూతన సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా గత నెలలో అధికారులు బెల్లం దుకాణాలపై తనిఖీలు నిర్వహించారు. బెల్లం వ్యాపారులతో సమావేశం నిర్వహించి సారా తయారీదారులకు బెల్లం విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అయితే బెల్లం విక్రయాలు పెరిగాయే తప్ప తగ్గలేదు. వ్యాపారులు కూడా నిబంధనలను అడ్డుపెట్టుకుని కేసుల నుంచి తప్పించుకుంటున్నారు. చింతలపూడి మార్కెట్‌కు లారీల్లో టన్నుల కొద్దీ బెల్లం వస్తుందనేది బహిరంగ రహస్యం. ఉన్నతాధికారులు బెల్లం గోడౌన్లపై దాడులు చేసి వ్యాపారులను కట్టడి చేస్తే సారా తయారీని అరికట్టవచ్చు.
చింతలపూడి నియోజకవర్గంలో విచ్చలవిడిగా బెల్లం అ మ్మకాలు సాగిస్తున్న వ్యాపారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. బెల్లం వ్యాపారులతో సంబంఽధిత అధికారులు కుమ్మక్కు కావడంతో సారాను అరికట్టలేకపోతున్నారు. బెల్లం అమ్మకాలను నియంత్రిస్తే సారా తయారీని నిర్మూలించవచ్చు.
– తొర్లపాటి బాబు, సీపీఐ మండల కార్యదర్శి
జోరుగా నల్ల బెల్లం విక్రయాలు


