ఇల వైకుంఠం | - | Sakshi
Sakshi News home page

ఇల వైకుంఠం

Dec 31 2025 7:23 AM | Updated on Dec 31 2025 7:23 AM

ఇల వై

ఇల వైకుంఠం

ఉత్తర ద్వార దర్శనంలో హైకోర్టు న్యాయమూర్తులు

ద్వారకాతిరుమల: చిన్నతిరుపతి క్షేత్రం మంగళవారం వైకుంఠాన్ని తలపించింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారు ఉత్తర ద్వారం వద్ద భక్తులకు దర్శనమిచ్చారు. భానుడి లేలేత కిరణాలు పుడమిపై ప్రసరించే వేళ.. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ ఉభయ దేవేరులతో శ్రీవారు ఉత్తర ద్వారం వద్ద వెండి గరుడ వాహనంపై సాక్షాత్కరించారు. ఈ వేడుక ఆద్యంతం భక్తులకు నేత్రపర్వమైంది. ముందుగా సిబ్బంది ఉత్తర ద్వారాన్ని పచ్చిపూలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వెండి గరుడ వాహనంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వేంచేపు చేసి, విశేషంగా అలంకరించారు. తెల్లవారుజాము 4.15 గంటలకు ఉత్తర ద్వారాలను తెరవగా, దేవస్థానం ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్‌ మూర్తి, ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీఎన్‌ఎన్‌ నివృతరావు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తదితరులు తొలి దర్శనం చేసుకుని, పూజాదికాలు జరుపుకున్నారు. అనంతరం భక్తులకు సర్వదర్శన భాగ్యాన్ని కల్పించారు. ఊహించని విధంగా వేలాది మంది భక్తులు, గోవింద స్వాములు స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షించి పరవశించారు. ఉదయం 7.30 గంటల సమయంలో స్వామి, అమ్మవార్లు ఉత్తర ద్వారం నుంచి వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవానికి బయల్దేరి వెళ్లారు. గజ, అశ్వ సేవల నడుమ ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. ఆ తరువాత ఉత్తర ద్వారం వద్ద వెండి శేష వాహనంపై కొలువైన స్వామి, అమ్మవార్లు రాత్రి 9 గంటల వరకు భక్తులకు దర్శనమిచ్చారు. సుమారు 50 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించినట్టు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే గోవింద దీక్షాదారులు తెల్లవారుజామున ఆలయ ప్రధాన రాజగోపుర మెట్ల మార్గంలో కర్పూరంతో స్వామివారి శంఖు, చక్ర, నామాలను ఏర్పాటు చేసి, వాటిని వెలిగించారు. అనంతరం ఇరుముడులతో స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు.

రూ. 40 లక్షల ఆదాయం..

శ్రీవారి రూ. 500 ప్రత్యేక దర్శనం టికెట్లు మధ్యాహ్నం వరకే విక్రయించారు. మొత్తం 2 వేల టికెట్లను విక్రయించారు. రాత్రి వరకు రూ. 200 టికెట్లు దాదాపు 3,500, రూ.100 టికెట్లు 3,500, 50 వేలకు పైగా లడ్డూ ప్రసాదాలు, 27,600 పులిహోర ప్యాకెట్లు, 10,530 శర్కర పొంగలి ప్యాకెట్లు విక్రయించారు. స్వామివారికి సుమారు రూ. 40 లక్షల మేర ఆదాయం లభించింది.

తోపులాటలో కింద పడిన భక్తులు

తెల్లవారుజామున క్యూకాంప్లెక్స్‌ వద్ద గేటు ఒక్కసారిగా తెరవడంతో తోపులాట జరిగి, కొందరు భక్తులు కింద పడిపోయారు. రూ. 500 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులను, అలాగే గ్రామస్తులను, గోవింద స్వాములను ఒకే దర్శనం క్యూలైన్‌లో పంపడం వివాదాస్పదమైంది. వీఐపీల పేరుతో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులను తూర్పు రాజగోపురం మీదుగా తీసుకెళ్లి, ధ్వజస్తంభం వద్ద ఉన్న మెయిన్‌ గేటులోంచి ఆలయంలోకి పంపారు. దాంతో క్యూలైన్లలో ఉన్న భక్తులు పలుమార్లు అరుపులు, కేకలు వేయడంతో ఆలయం గందరగోళంగా మారింది. టీడీపీ నాయకులకు, వీఐపీలకు ఉన్న విలువ తమకు లేదంటూ కొందరు సిబ్బంది గుసగుసలాడారు. సాయంత్రం 5 గంటలకు సాయంకాలార్చన నిమిత్తం నిలుపుదల చేయాల్సిన స్వామివారి దర్శనాన్ని, భక్తులు గొడవ చేయడంతో గంట అదనంగా కొనసాగించి, 6 గంటలకు నిలుపుదల చేశారు.

ఉత్తర ద్వారం వద్ద వెండి గరుడ వాహనంపై కొలువైన స్వామి, అమ్మవార్లు

ఆలయంలో భక్తుల తోపులాట

గరుడ వాహనంపై గ్రామోత్సవం

ద్వారకాతిరుమల: ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని మంగళవారం ఉదయం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌, జస్టిస్‌ వి.గోపాలకృష్ణారావు వేర్వరుగా సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన వారికి ముందుగా దేవస్థానం ఈఓ అర్చకులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. న్యాయమూర్తులు ఉత్తర ద్వారం వద్ద స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు.

ద్వారకాతిరుమలలో వైభవంగా శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం

50 వేల మందికిపైగా స్వామిని దర్శించిన భక్తులు, గోవింద స్వాములు

గరుడ వాహనంపై నేత్రపర్వంగా గ్రామోత్సవం

ఇల వైకుంఠం1
1/7

ఇల వైకుంఠం

ఇల వైకుంఠం2
2/7

ఇల వైకుంఠం

ఇల వైకుంఠం3
3/7

ఇల వైకుంఠం

ఇల వైకుంఠం4
4/7

ఇల వైకుంఠం

ఇల వైకుంఠం5
5/7

ఇల వైకుంఠం

ఇల వైకుంఠం6
6/7

ఇల వైకుంఠం

ఇల వైకుంఠం7
7/7

ఇల వైకుంఠం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement