పండగ పూటా పస్తులే?
శానిటరీ కార్మికుల ఆవేదన
జంగారెడ్డిగూడెం: వేతనాలు లేక పండుగ పూట కూడా పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఏరియా ఆసుపత్రి శానిటరీ కార్మికులు తెలిపారు. మంగళవారం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి వద్ద ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో శానిటరీ కార్మికులు విధులు బహిష్కరించి సమ్మె నిర్వహించారు. ఆసుపత్రి వద్ద నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ క్రిస్మస్ నాటికి మూడు నెలల బకాయిలు అందకపోవడంతో క్రిస్మస్ నాడు కూడా పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడిందన్నారు. కాంట్రాక్టర్ల సమన్వయ లోపం కార్మికుల పాలిట శాపమై పస్తులు ఉండే పరిస్థితికి తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్పిటల్ లో పనిచేస్తున్న శానిటరీ కార్మికులకు మూడు నెలల వేతనాలు, 20 నెలల ప్రావిడెంట్ ఫండ్ కార్మికుల ఖాతాలకు జమ చేయలేదు. వేతనాలు విడుదల చేసేంతవరకు విధులు బహిష్కరిస్తామని తెలిపారు. ఏపీ మెడికల్ కాంటాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఏఐటీయూసీ గౌరవాధ్యక్షుడు జంపన వెంకటరమణ రాజు మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఏజెన్సీని తొలగించి ప్రభుత్వమే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులుగా పరిగణించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయుసీ నాయకులు దయామణి, మేరీ, చంద్రకళ, చల్లాలు, జె.దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.


