డిమాండ్ల పరిష్కారంలో అలసత్వం వీడాలి
నూజివీడు: ట్రిపుల్ ఐటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారంలో ఆర్జీయూకేటీ అధికారులు అలసత్వం వీడాలని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు పేర్కొన్నారు. నూజివీడు ట్రిపుల్‌ఐటీలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఆందోళన మంగళవారం ఆరో రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాన్సలర్‌తో సమావేశం ఏర్పాటు చేస్తానని నమ్మబలికిన డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ టెక్‌జైట్ ప్రారంభోత్సవం తర్వాత పత్తా లేకుండా పోయారన్నారు. తమ జీవితాలతో ఉన్నతాధికారులు దోబూచులాడడం బాధాకరమన్నారు. ప్రస్తుత చాన్సలర్ తమను కనీసం మనుషులుగా కూడా చూడకపోవడం దారుణమన్నారు. తమ జీతాల పెంపు ఫైల్‌ను చాన్సలర్ మూడు నెలల నుంచి తన దగ్గర పెట్టుకుని ఏ నిర్ణయం తీసుకోకపోవడం గర్హనీయమన్నారు. ఏఓ బీ లక్ష్మణరావు, సెంట్రల్ ఏఓ బండి ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు.
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ ఈఓగా వై.భద్రాజి నియమితుల య్యారు. ప్రస్తుత ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి ఈనెల 31న బుధవారం పదవీ విరమణ పొందనున్నారు. శ్రీవారి దేవస్థానంలో ఉప కార్యనిర్వాహణాధికారిగా విధులు నిర్వర్తిస్తున్న భద్రాజిని పూర్తి అదనపు బాధ్యతలతో ఈఓగా నియమిస్తూ ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శి డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ మంగళవారం జీఓ జారీ చేశారు.
ఏలూరు(మెట్రో): జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల మార్పు, అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, తదితర అంశాలపై రెవెన్యూ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణపై అందిన ఫారం–6, 7, 8 దరఖాస్తులను పరిశీలించి, నిర్దేశించిన సమయంలోగా నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని, వీటి పరిష్కారంపై ప్రతీరోజు పోలింగ్ బూత్ స్థాయి అధికారులతో సమీక్షించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. జంగారెడ్డిగూడెం డివిజన్‌లోని పోలవరం, జీలుగుమిల్లిలో కొత్తగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై వెంటనే నివేదిక అందజేయాలన్నారు. ఫొటో ఓటరు గుర్తింపు కార్డులను నూరుశాతం పంపిణీ చేయాలన్నారు. సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, నూజివీడు సబ్ కలెక్టర్ బి.వినూత్న, ఆర్డీఓలు అచ్యుత్ అంబరీష్, రమణ, కలెక్టరేట్ సూపరింటెండెంట్ చల్లన్న దొర, తహసీల్దార్లు, రెవిన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కొయ్యలగూడెం: ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. బయ్యన్నగూడెం సెక్టార్ ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. సీఐటీయు 18వ అఖిలభారత మహాసభలు విజయవంతం చేయాలంటూ ప్రదర్శన చేపట్టారు. అంగన్‌వాడీ వర్కర్లకు కనీస వేతనాలు 26,000 చేయాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని జనవరి 4న జరిగే బహిరంగ సభలో పాల్గొనాలని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు శుక్లబోయిన రాంబాబు కోరారు.
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాకు చెందిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్ మహిళను వేధింపులకు గురిచేయటంతో ఆమె రాష్ట్ర మహిళ కమిషన్‌ను ఆశ్రయించగా... విచారణకు ఆదేశించారు. మెడికల్ షాపులో పనిచేస్తున్న మహిళతో డ్రగ్ ఇన్స్‌పెక్టర్ అబిద్ ఫోన్‌లో సంభాషిస్తూ వేధింపులకు గురిచేయగా, ఆమె జిల్లా కేంద్రంలోని ఔషధ నియంత్రణ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెబుతున్నారు. అనంతరం బాధిత మహిళ రాష్ట్ర మహిళ కమిషన్ ఆశ్రయించడంతో విచారణ చేసి సమగ్రమైన నివేదిక ఇవ్వాలని పోలీస్ అధికారులకు మహిళ కమిషన్ మంగళవారం ఆదేశించింది.


