ఆయుధ డిపోకు వ్యతిరేకంగా ధర్నా
కొయ్యలగూడెం: నేవీ ఆయుధ కర్మాగార డిపో ఏర్పాటుకు వ్యతిరేకంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు. బోడిగూడెం పంచాయతీ పరిధిలో బర్కెట్‌నగర్ ప్రాంతంలో నేవీ డెక్ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతున్నందుకు నిరసనగా నిరసన వ్యక్తం చేశారు. ఒకప్పుడు బీడు భూములుగా ఉన్న తమ పొలాల్లో పోలవరం ప్రాజెక్టు వల్ల బోరులు పడుతున్నాయని రెండు పంటలు పండే భూములను డిపో ఏర్పాటు వల్ల కోల్పోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కర్మాగార డిపో నిర్మాణానికి 1200 ఎకరాలు అవసరం కాగా అందులో 400 ఎకరాల భూములు సన్న చిన్న కారు రైతులకు చెందినవేనన్నారు. భూములు కోల్పోతే కుటుంబాలతో సహా నడిరోడ్డున పడతామంటూ గోడు వెళ్లబోసుకున్నారు. నేవీ డాక్ యార్డ్ స్థాపించడానికి స్థానికంగా ఉన్న రైతులందరూ ఒప్పుకున్నట్టు త్వరలో భూసేకరణ జరుగుతున్నట్లు వార్త వచ్చిందని, ఇది పూర్తిగా అసత్యమని, రైతులు వద్దకు ఎవరు సంప్రదింపులకు రాలేదని ఖండించారు. కనీసం గ్రామసభ కూడా నిర్వహించకుండా ప్రచారం చేయడాన్ని రైతులంతా తప్పుబట్టారు. బోడిగూడెం పరిధిలో ఉన్న భూములు చిన్న సన్నకారు రైతులవని, ఈ భూములు ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని రైతులు పేర్కొన్నారు.


