ప్రమాదం.. అంచున!
మరమ్మతులు చేయించాలి
ప్రజా సమస్యలు పట్టవా?
● అధ్వానంగా రోడ్డు మార్జిన్లు
● 16 నెలలుగా మరమ్మతుల్లేవు
● మంత్రి ఇలాకాలోనూ పనులు కరువు
నూజివీడు: నూజివీడు ప్రాంతంలో రహదారుల మార్జిన్లు కొట్టుకుపోయి 16 నెలలు గడిచినా మరమ్మతులకు నోచుకోవడం లేదు. గతేడాది ఆగస్టు 31న సంభవించిన వరదలకు మండలంలోని పలు రోడ్డు మార్జిన్లు కోతకు గురయ్యాయి. దీంతో వా హనచోదకులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రాత్రిపూట ప్రమాదాల ముప్పు పొంచి ఉందని ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన చోట్ల పరిస్థితి చెప్పాల్సిన పనిలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పలుచోట్ల కోత
నూజివీడు నుంచి సుంకొల్లు వెళ్లే రహదారిపై ఈదుల చెరువు కట్టపై మార్జిన్ కోతకు గురై ప్రమాదకరంగా మారింది. ఏమాత్రం ఆదమరిచినా 20 అడుగుల లోతులో ఉన్న చెరువులోకి పడాల్సిందే. రాత్రిళ్లు కారు, ట్రాక్టర్ వంటి వాహనాలు ఎదురైతే ద్విచక్ర వాహనదారులు ప్రమాదానికి గురికావడం ఖాయం. అలాగే నూజివీడు నుంచి బోర్వంచ వెళ్లే రోడ్డులో పట్టణంలోని సెయింట్‌థామస్ హైస్కూల్ వెనుక భాగంలోని మలుపు వద్ద పెద్ద అగాధం ఏర్పడింది. ఇక్కడా ఏదైనా భారీ వాహనం ఎదురైతే ప్రమాదం పొంచి ఉంది.
సుంకొల్లు చెరువుకట్టపై ఉన్న తారురోడ్డు మార్జిన్ కోతకు గురై ప్రమాదకరంగా ఉంది. 16 నెలలుగా మరమ్మతులు చేయించడం లేదు. కార్లు, ట్రాక్టర్లు ఎదురైనప్పుడు సైకిల్‌పై గడ్డిమోపు తీసుకెళ్లడానికి కూడా వీలుండటం లేదు.
– కలపాల రవి, సుంకొల్లు
రహదారి మార్జిన్ ధ్వంసమై 16 నెలలు అయినా పట్టించుకోకపోవడం దారుణం. ప్రజా సమస్యల పరిష్కారంపై పాలకుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేయించాలి.
– జి.రాజు, సీపీఎం నేత, నూజివీడు
ప్రమాదం.. అంచున!
ప్రమాదం.. అంచున!
ప్రమాదం.. అంచున!


