
ఆటోలకు క్యూఆర్ డిజిటల్ స్టిక్కర్లు
ఏలూరు టౌన్: ఏలూరు నగరంలోని ఆటోలకు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ స్టిక్కర్లను జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ చేతుల మీదుగా ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో అందజేశారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో మంగళవారం ఆటోలకు డిజిటల్ స్టిక్కర్లు, డ్రైవర్లకు గుర్తింపు కార్డుల మంజూరు కార్యక్రమాన్ని ట్రాఫిక్ సీఐ లక్ష్మణరావు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. నగరంలోని సుమారు 2 వేల ఆటోలకు క్యూఆర్ కోడ్ డిజిటల్ స్టిక్కర్లు, ఆటో డ్రైవర్లకు గుర్తింపు కార్డులు అందజేశారు. నగరంలో సుమారుగా 4 వేల ఆటోలు ఉండగా, తొలి దశలో రెండువేల ఆటోలకు డిజిటల్ స్టిక్కర్లు అందించేలా చర్యలు చేపట్టామని ఎస్పీ స్పష్టం చేశారు. డ్రైవర్లు క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ స్టిక్కర్లు పొందేందుకు వెంటనే ట్రాఫిక్ పోలీసులను సంప్రదించాలని చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు సెప్టెంబర్ నెలాఖరు వరకూ గడువు ఇస్తున్నామన్నారు. కొందరు డ్రైవర్లు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేలా రోడ్లపైనే ఆటోలను నిలుపుదల చేస్తున్నారని, ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్ చెప్పారు. ఆటో డ్రైవర్లకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు.