
గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్
పెదపాడు: గంజాయి రవాణా చేస్తున్న నిందితులను అరెస్టు చేశామని, మరికొంతమందిని త్వరలో పట్టుకుంటామని నూజివీడు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్ తెలిపారు. ఆగస్టు 25న కలపర్రు టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు ఓ వ్యానులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ వాహనంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దర్వాసి గ్రామానికి చెందిన మహ్మద్ రాజు, మహ్మద్ ఇమ్రాన్‌లను అరెస్ట్ చేశారు. హైదరాబాదుకు చెందిన వహీద్‌ఖాన్ చెప్పిన ప్రకారం రాజమండ్రి దగ్గరలోని కోరుకొండ డొంక వద్ద ఉన్న గుమ్మాలదొడ్డి గ్రామానికి వెళ్లి అక్కడ వంతల గాసీరామ్ అందించిన 65 కేజీల గంజాయిని తీసుకుని హైదరాబాద్ తరలిస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. మహ్మద్ రాజు 2014లో కొవ్వూరు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో 2015లో సంబంధిత కేసుల్లో తొమ్మిది సంవత్సరాలు రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించి 2024లో విడుదలయ్యాడు. మిగిలిన ముద్దాయిలను కూడా రాజమండ్రి, విశాఖ ఏజెన్సీలో ఉన్నట్లు గుర్తించామని వారిని పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో హెచ్‌సీ సుదర్శన్, పీసీలు కృష్ణప్రసాద్, నరసింహరావు, నాగార్జున పాల్గొన్నారు.
కొయ్యలగూడెం: పిచ్చికుక్క స్వైర విహారం చేయడంతో మంగళవారం పలువురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వాటర్ ట్యాంక్ రామాలయం ప్రాంతంలో అలిమేలు శ్రీనివాస్ అనే వృద్ధుడిపై తొలుత నల్లగా ఉండే కుక్క ఒకటి దాడి చేసి శరీరంపై పలుచోట్ల తీవ్రంగా కరిచింది. దీంతో రక్తస్రావంతో పడి ఉన్న శ్రీనివాసుని స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లి జాయిన్ చేశారు. అదే కుక్క కన్నాపురం రోడ్డులో చిట్టిబాబు, వీరబాబు అనే ఇద్దరు యువకులపై కూడా దాడి చేసి గాయపరిచింది. మొత్తంగా మంగళవారం ఒక్క రోజునే ప్రభుత్వాస్పత్రిలో కుక్క కరవడం వల్ల ఎనిమిది మంది వ్యక్తులు చికిత్స తీసుకున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.
నూజివీడు: చెల్లని చెక్కు కేసులో నూజివీడు మండలం రావిచర్లకు చెందిన పురాణం రామలక్ష్మికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్ మెజిస్ట్రేట్ వేల్పుల కృష్ణమూరి మంగళవారం తీర్పును వెలువరించారు. పట్టణానికి చెందిన మద్దిరాల కోటేశ్వరరావు రామలక్ష్మికి 2020 ఆగస్టు 20న రూ.5లక్షలు, 2021 ఫిబ్రవరిలో రూ.4 లక్షలు అప్పుగా ఇచ్చాడు. ఆ తరువాత బాకీ తీర్మానం నిమిత్తం 2022 ఫిబ్రవరి 4న రామలక్ష్మి రూ.9 లక్షలకు కోటేశ్వరరావుకు చెక్కును ఇచ్చారు. ఆ చెక్కును నగదు నిమిత్తం బ్యాంకులో వేయగా రామలక్ష్మి ఎక్కౌంట్‌లో నగదు లేదని చెక్కును వెనక్కు తిప్పి పంపారు. దీనిపై కోటేశ్వరరావు కోర్టులో కేసు వేయగా న్యాయమూర్తి జైలుశిక్ష, జరిమానా విధించారు.
చెల్లని చెక్కు కేసులో నూజివీడుకు చెందిన పెనిమల నాగమల్లేశ్వరరావుకు ఆరు నెలల జైలు శిక్ష, రూ.7లక్షల జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్ మెజిస్ట్రేట్ వేల్పుల కృష్ణమూరి మంగళవారం తీర్పును వెలువరించారు. పట్టణానికి చెందిన నెల్లిమర్ల విఘ్నేశ్వరరావు 2019 డిసెంబరు 18న నాగమల్లేశ్వరరావుకు రూ.7లక్షలు, అప్పుగా ఇచ్చారు. ఆ తరువాత బాకీ తీర్మానం నిమిత్తం నాగమల్లేశ్వరరావు రూ. 6లక్షలకు చెక్కును ఇచ్చారు. ఆ చెక్కును నగదు నిమిత్తం బ్యాంకులో వేయగా అకౌంట్‌లో నగదు లేదని చెక్కును వెనక్కు తిప్పి పంపారు. దీనిపై విఘ్నేశ్వరరావు కోర్టులో కేసు వేయగా న్యాయమూర్తి జైలుశిక్ష, జరిమానా విధించారు.