
దివ్యాంగుల ఉసురు పోసుకుంటున్నారు
ఏలూరు (టూటౌన్): సాఫీగా అందుతున్న పింఛన్లను రీ వెరిఫికేషన్ పేరిట తొలగించి పాలకులు మా ఉసురు పోసుకుంటున్నారని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగ పింఛన్ల తొలగింపును నిరసిస్తూ సోమవారం కలెక్టరేట్ వద్ద దివ్యాంగులు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు మామిడిపల్లి నాగభూషణం మాట్లాడుతూ పుట్టుకతో వికలాంగులమైన తాము గత 20, 30 ఏళ్ల నుంచి మెడికల్ బోర్డు అథారిటీ మంజూరు చేసినా మెడికల్ సర్టిఫికెట్‌ను కొనసాగిస్తున్నామన్నారు. అయితే తాజాగా సదరం సర్టిఫికెట్ పేరుతో కొత్త విధానాన్ని తీసుకువచ్చి పుట్టుకతో తమ వైకల్య శాతాన్ని తక్కువ చేసి చూపడం అన్యాయమన్నారు. దీంతో తాము పింఛన్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు, పథకాలకు దూరమవుతామని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా నాలుగు వేలకుపైగా పింఛన్లు తొలగించడం దుర్మార్గమన్నారు. కూటమి ప్రభుత్యానికి పింఛన్ల కోత విధించేందుకు దివ్యాంగులే కనిపించారా అంటూ నిలదీశారు. 2010లో ఇచ్చిన సదరం సర్టిఫికెట్లు ఆధారంగా తమ పింఛన్లు కొనసాగించాలని డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో దివ్యాంగులు పాల్గొన్నారు.