
సర్వీస్ రోడ్లు నిర్మించాలి
టి.నరసాపురం: గ్రీన్ ఫీల్ హైవేకు సర్వీస్ రోడ్ల ప్రొవిజన్ కల్పించాలని.. పరిహారం పెంచాలని, భూ నిర్వాసిత రైతుల సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ హెచ్చరించారు. ఆదివారం టి.నరసాపురం శివాలయం ప్రాంగణంలోని కాశీ విశ్వేశ్వర కల్యాణ మండపంలో హైవే భూ నిర్వాసిత రైతుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు రైతుల పోరాట కమిటీ నాయకులు దేవరపల్లి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 2న జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం వద్ద హైవే దిగ్బంధం చేపట్టాలని సదస్సు నిర్ణయించింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన కె.శ్రీనివాస్ మాట్లాడుతూ 2013 భూ సేకరణ చట్టాన్ని తుంగలో తొక్కి రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని విమర్శించారు. సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ కల్పించాలని డిమాండ్ చేశారు. అన్ని గ్రామాలకు ఎగ్జిట్స్ నిర్మించాలన్నారు. కార్యక్రమంలో రైతుల పోరాట కమిటీ నాయకులు వామిశెట్టి హరిబాబు, పర్వతనేని మురళి, మాలెంపాటి హరిబాబు, చీకటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.