
మోదేలు.. ఎన్నాళ్లీ ఎదురుచూపులు?
బుట్టాయగూడెం: మారుమూల ప్రాంతమైన మోదేలు గ్రామానికి మంజూరైన గృహాలు నిర్మించడంతోపాటు రోడ్డు, విద్యుత్ సదుపాయం కల్పించాలని ఆ గ్రామ గిరిజనులు కోరుతున్నారు. బ్రిటిష్ కాలంలోనే అటవీ, పోడు భూముల వ్యవసాయం కోసం తమ గ్రామాన్ని ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నామని ప్రస్తుతం రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉండకూడదంటూ తమకు మంజూరైన ఇళ్ల నిర్మాణం, విద్యుత్, రోడ్డు నిర్మాణం పనులను ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎన్నో దశాబ్దాలుగా ఉంటున్న తమను అక్కడి నుంచి ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారని దీనివల్ల తీవ్రంగా నష్టపోతామంటూ కొండరెడ్డి గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొండ దిగి వస్తే సౌకర్యాలు కల్పిస్తాం
మోదేలు గ్రామం పాపికొండల అభయారణ్యం పరిధిలోకి వస్తుందని అందువల్లే అక్కడ ఇళ్లు నిర్మాణానికి, గ్రామానికి రోడ్డు, విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు అనుమతులు ఇవ్వడం లేదని అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఆయా ప్రాంతాల్లో వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరగాలనే ఉద్దేశంతోనే అభయారణ్యం పరిధిలో ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం లేదంటూ అధికారులు చెబుతున్నారు. కొండదిగి వస్తే దిగువ ప్రాంతంలో ఇళ్లు నిర్మించి వారికి మౌలిక సదుపాయాలు కల్పించేలా కృషి చేస్తామని ఐటీడీఏ పీఓ రాములు నాయక్ చెబుతున్నారు.
ఢిల్లీకి లేఖ రాసిన మోదేలు గిరిజనులు
స్వాతంత్య్రం రాకముందే ఏర్పడిన తమ గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అధికారులు కృషి చేయడం లేదని తమను అక్కడి నుంచి ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారని తామున్న ప్రదేశంలోనే తమకు మంజూరైన 23 ఇళ్లు నిర్మాణంతోపాటు రోడ్డు నిర్మాణం, విద్యుత్ సదుపాయం కల్పించాలని కోరుతూ రాష్ట్రపతికి ఒక లేఖ రాశారు. జాతీయ గిరిజన కమిషన్‌కు కూడా లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఇక్కడి పరిస్థితిని పరిశీలించేందుకు సెప్టెంబర్ 1న జాతీయ ఎస్టీ కమిటీ బృందం పర్యటిస్తున్నట్లు గిరిజనులు చెబుతున్నారు. కమిటీ రాకతో తమ సమస్య తీరుతుందనే ఆశతో అడవి బిడ్డలు ఎదురు చూస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నిధుల మంజూరు
వైఎస్సార్‌సీపీ పాలనా సమయంలో మోదేలు గ్రామానికి సుమారు రూ.70 లక్షల వ్యయంతో విద్యుత్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారు. రూ.3 కోట్లతో రోడ్డు నిర్మాణానికి నిధులు కూడా మంజూరు చేశారు. ఫారెస్ట్ అధికారుల అభ్యంతరాలతో ఆ పనులు నిలిచిపోయాయి. గత ఏడాది పీఎంజేఎస్‌వై నిధులతో సుమారు 23 ఇళ్లు మంజూరయ్యాయి. వీటి నిర్మాణాలకు ఫారెస్ట్ అధికారులు అభ్యంతరాలు చెప్పడంతో అవి కూడా నిలిచిపోయాయి.
మోదేలు గ్రామానికి నిలిచిన రహదారి, విద్యుదీకరణ పనులు
రిజర్వ్ ఫారెస్టు కారణంగా అనుమతి లేదంటున్న అధికారులు
కొండ దిగి వస్తే సౌకర్యాలు కల్పిస్తామంటున్న ఐటీడీఏ పీఓ
సెప్టెంబర్ 1న మోదేలును సందర్శించనున్న ఎస్టీ కమిషన్ బృందం

మోదేలు.. ఎన్నాళ్లీ ఎదురుచూపులు?

మోదేలు.. ఎన్నాళ్లీ ఎదురుచూపులు?