మారని పోలీసుల తీరు | - | Sakshi
Sakshi News home page

మారని పోలీసుల తీరు

Aug 26 2025 7:44 AM | Updated on Aug 26 2025 7:44 AM

మారని

మారని పోలీసుల తీరు

నా కోసం మా కుటుంబం రాకూడదా?

సాక్షి ప్రతినిధి,ఏలూరు: తప్పుడు కేసులు.. అక్రమ అరెస్టులు.. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి ఇష్టానుసారంగా కేసుల పేరుతో వేధింపులు.. మరీ కోపం తారాస్థాయికి చేరితే థర్డ్‌ డిగ్రీ పేరుతో పోలీస్‌ ట్రీట్‌మెంట్‌.. ఇది ప్రస్తుతం ఏలూరు జిల్లాలో సాగుతున్న పోలీసింగ్‌. అక్రమ అరెస్టులపై న్యాయస్థానాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా పోలీసుల తీరు మారకపోవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇదే తరహాలో ఒక కేసు విషయంలో పెదవేగి ఎస్సైపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసి మెమో జారీ చేశారు. మళ్లీ అదే ఎస్సైకి అలాంటి కేసు విషయంలోనే మెమో జారీ చేయడంతో పాటు చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా ఎస్పీని ఆదేశించడం పోలీస్‌ శాఖలో హాట్‌టాఫిక్‌గా మారింది.

విమర్శలకు తావిస్తూ..

దెందులూరు నియోజకవర్గంలో పోలీసుల తీరు విమర్శలకు తావిస్తుంది. అధికార పార్టీకి పూర్తిగా దాసోహమై అడ్డగోలు కేసులు, సంబంధం లేని వ్యక్తులను స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్‌లు ఇవ్వడం, అక్రమ అరెస్టులకు కేంద్రంగా మారింది. వ్యక్తిగత వివాదాలు పార్టీ రంగు పూసి వేధించడం, సివిల్‌ వ్యవహారాల్లోనూ అధికార పార్టీ నేతల ఆదేశాలతో తలొగ్గి పనిచేయడం తరచూ వివాదాస్పదమవుతోంది. చేపల చెరువుల్లో చేపలు పట్టుకోవడానికి రక్షణ కల్పించమని హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకుని మరీ చేపలు పట్టే పరిస్థితులు కొన్నిచోట్ల ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి.

తాజాగా మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి నివాసం వద్ద టీడీపీ, వైఎస్సార్‌సీపీ శ్రేణుల మధ్య కొనసాగిన ఉద్రిక్తత వాతావరణంలో 15 మందిపై కేసులు నమోదు చేశారు. జిల్లాపరిషత్‌ వైస్‌ చైర్మన్‌తో పాటు ముఖ్యనేతలు, మరికొందరు నాయకులు వీరిలో ఉన్నారు. వీరిలో ఏలూరు రూరల్‌ మండలం చాటపర్రు సర్పంచ్‌ గుడిపూడి రఘు ఏ15గా ఉన్నారు. శనివారం ఉదయం ఏలూరు రూరల్‌ పోలీసులు హడావుడిగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రానికి పెదపాడు పోలీస్‌స్టేషన్‌కు మార్చారు. ఆదివారం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా అక్రమ అరెస్టుపై ఆగ్రహం వ్యక్తం చేసి ఎస్సై రామకృష్ణకు మెమో జారీ చేశారు. అలాగే చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్పీని ఆదేశించారు. కట్‌చేస్తే.. రఘును శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో మధ్యాహ్నం కుటుంబసభ్యులు, కొందరు పార్టీ నాయకులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని రఘును చూడటానికి పోలీసులతో మాట్లాడానికి ప్రయత్నించగా నిరాకరించారు. పోలీసుల తీరుపై కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉన్న కుటుంబసభ్యులు, వైఎస్సార్‌సీపీ నేతలపై సోమవారం ఏలూరు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సర్పంచ్‌ రఘు తల్లి మార్తమ్మ, భార్య జ్యోతి, సోదరుడు రాజేష్‌తో పాటు స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు అప్పనప్రసాద్‌, ముంగర సంజీవ్‌కుమార్‌, బత్తుల ఏసురాజులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పదేపదే అక్రమ కేసుల నమోదు

సరికొత్త వేధింపులకు తెర తీసిన వైనం

పెదవేగి ఎస్సైకు గతంలో మెమో జారీ చేసిన న్యాయమూర్తి

మళ్లీ రెండోసారి మెమో జారీ

న్యాయస్థానాలు మందలిస్తున్నా మారని నైజం

చాటపర్రు సర్పంచ్‌ కుటుంబ సభ్యులపైనా కేసులు

పోలీసులు ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని అరెస్టు చేస్తే అతని తల్లి, తమ్ముడు, భార్య రాకూడదా..? కుటుంబ సభ్యులకు కాకుండా ఇంక ఎవరికి బాధ్యత ఉంటుంది. ఎవరు రావాలి.. ఎవరు రాకూడదనే విషయంపై ఏమైనా నిబంధనలు ఉన్నాయా. తాను బాధ్యత గల సర్పంచ్‌గా ఉన్నాను. నా తరఫున క్షేమం కోరి కుటుంబసభ్యులు, ప్రజాప్రతినిధులు, స్నేహితులు వస్తారు ఇదెలా తప్పు అవుతుంది.

– గుడిపూడి రఘు, చాటపర్రు సర్పంచ్‌

మారని పోలీసుల తీరు 1
1/1

మారని పోలీసుల తీరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement