
సెల్ టవర్ ఎక్కి హల్‌చల్
కొయ్యలగూడెం: కొయ్యలగూడెంలో సెల్ టవర్ ఎక్కి ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. టి.అయ్యప్ప అనే యువకుడు అశోక్‌నగర్‌లో నివసిస్తున్నాడు. సోమవారం వేకువజామున కొవ్వూరు రోడ్డులోని బీఎస్‌ఎన్‌ఎల్ టవర్‌పైకి ఎక్కి గ్రామ పెద్దలకు ఫోన్ చేసి గ్రామ సమస్యలు పరిష్కరించకపోవడంతో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ మెసేజ్‌లు పెట్టడంతో పాటు ఫోన్‌లు కూడా చేశాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు, పోలవరం ఇన్‌స్పెక్టర్ బాల సురేష్‌బాబు, కొయ్యలగూడెం ఎస్సై చంద్రశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన అయ్యప్పకు నచ్చజెప్పి కిందకు దించారు. తర్వాత అతడికి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. గ్రామంలో పలు సమస్యలు ఉన్నాయని సీసీ రోడ్లు, డ్రెయిన్లు నిర్మించాలని, ఆలయాల సొమ్ము దుర్వినియోగం అవుతుందని వీటిపై గ్రామ పెద్దలు పట్టించుకోకపోవడంతో మనస్తాపంతో తాను ఆత్మహత్యకు యత్నించినట్టు అయ్యప్ప అధికారులకు వివరించాడు.