
మిగులు భూములు పంచాలంటూ ధర్నా
ఏలూరు (టూటౌన్): మిగులు భూములను గిరిజన, దళిత, పేదలకు పంచాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించారు. భూ సమస్యలు ఎదుర్కొంటున్నటు గిరిజనులు, దళితులు, పేదలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నినాదాలు చేశారు. ధర్నానుద్దేశించి సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి.బలరాం, జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడారు. జిల్లాలోని అన్నిరకాల భూ సమస్యలు పరిష్కరించాలని, 1/70 చట్టం అమలు చేయాలని, ఎల్‌టీఆర్, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని, అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని అర్హులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని, నిర్వాసిత కాలనీల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని, కొల్లేరును 3వ కాంటూరుకు కుదించాలని డిమాండ్ చేశారు. కొల్లేరులో జిరాయితీ భూములు పేదలకు పంచాలని, ప్రభుత్వ భూములను కొల్లేరు ప్రజలకు పంచాలని కోరారు. అనంతరం కలెక్టర్‌కి వినతిపత్రం సమర్పించారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు ఎం.నాగమణి, సభ్యులు డీఎన్‌వీడీ ప్రసాద్, ఆర్.లింగరాజు, పిల్లి రామకృష్ణ, కె.శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు.