
కూటమిలో డిష్యూం.. డిష్యూం
ఆకివీడు: మండలంలోని అజ్జమూరు జనార్థనస్వామి దేవస్థానం నూతన కమిటీ ప్రమాణస్వీకారం రసాభాసగా ముగిసింది. దేవస్థాన కమిటీ చైర్మన్ పదవిని జనసేనకు కేటాయించారు. చైర్మన్‌గా నాని, డైరెక్టర్లు ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో బీజేపీ మండల అధ్యక్షురాలు ముదునూరి నాగమణి అభ్యంతరం చెప్పారు. తమకు తెలియకుండా బోర్డును ఎన్నుకోవడం సమంజసం కాదన్నారు. నియామకంలో తమకు ఎందుకు ప్రాతినిధ్యం కల్పించలేదని నిలదీశారు. మరో బీజేపీ నాయకుడు వర్ధినేని లక్ష్మీ వర ప్రసాద్ మాట్లాడుతూ చైర్మన్ పదవిని రూ.3 లక్షలకు కొనుగోలు చేశారనే ఆరోపణలు గ్రామంలో వెల్లువెత్తుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని అన్నారు. హిందూ దేవాలయాల్లో అన్య మతస్తుల్ని నియమించకూడదన్న నిబంధన ఎందుకు పాటించలేదని ప్రసాద్ నిలదీశారు. మతం తీసుకున్న వ్యక్తులు హిందూ దేవాలయ కమిటీల్లో ఉండకూడదని పట్టుబట్టారు. దీనిపై చర్యలు తీసుకోకపోతే దేవాలయ శాఖ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తానని హెచ్చరించారు. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకదశలో జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి జుత్తిగ నాగరాజు బీజేపీ నాయకుడు వర ప్రసాద్‌పై మండిపడ్డారు. ఇలాంటి వారిపై ఎందుకు చర్య తీసుకోరని బీజేపీ మండల అధ్యక్షురాల్ని ప్రశ్నించారు. తమకు తెలియకుండా బోర్డు వేయడం తప్పు కాదా! అని ఆమె ఎదురు ప్రశ్నవేశారు. ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం పెరగడంతో గ్రామ పెద్దలు కలుగజేసుకుని సర్దిచెప్పారు.
రసాభాసగా అజ్జమూరు దేవస్థాన కమిటీ ప్రమాణస్వీకారం