
టీడీపీ నేత అరాచకంపై ఆగ్రహం
జంగారెడ్డిగూడెం: కూటమి ప్రభుత్వంలో సాక్షాత్తు తమ నాయకులతో సహా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో బాట గంగానమ్మ లేఅవుట్ కాలనీకి చెందిన ఓ సీనియర్ టీడీపీ నాయకుడిపై అదే కాలనీకి చెందిన ఓ టీడీపీ నేత, అతని కుటుంబసభ్యులు, మరికొంతమంది దాడి చేసి గాయపరిచారు. అడ్డు చెబితే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. బాటగంగానమ్మ లే అవుట్ కాలనీకి చెందిన ఎం.ఫకీర్ నాయుడు టీడీపీలో ఉంటూ కొన్ని సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతంలో స్థానికుల సహకారంతో పార్టీలకు అతీతంగా వినాయకుడి గుడిని నిర్మిస్తున్నారు. ఆ ప్రాంతంలో కొత్తగా టీడీపీ వార్డు ప్రధాన కార్యదర్శిగా పదవి చేపట్టిన ఒక నాయకుడు ఫకీర్ నాయుడు వద్దకు వచ్చి ఉత్సవాలు చేయడానికి వీల్లేదని బెదిరించడమే కాకుండా రాళ్లతో దాడి చేశారు.
మహిళలపై దాడులు
ఆ ప్రాంతంలో కూటమికి చెందిన మహిళలు సైతం అక్కడ టీడీపీ నేత అరాచకాలకు ఏం చేయాలో తెలియక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రయితే ఇంటి నుంచి బయటకు రావాలంటే భయం వేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా టీడీపీ నాయకుడే చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మద్యంతోపాటు, గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు సేవిస్తూ, సైరన్ శబ్దాలతో కాలనీ వాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇదేంటని అడిగిన పెద్దలపై దాడులకు తెగబడటమే కాకుండా మహిళల మీద కూడా దాడులు చేస్తున్నారన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆరేడు నెలలుగా కాలనీలో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నామన్నారు. పోలీసులు జోక్యం చేసుకుని తమకు ఈ ప్రాంతంలో రక్షణ ఏర్పాటు చేయాలని, ఉత్సవాలలో ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
జంగారెడ్డిగూడెం లేఅవుట్ కాలనీ వాసుల ఆందోళన
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన కాలనీ