
చవితి కళ..ఉపాధి భళా
ద్వారకాతిరుమల: దండాలయ్యా.. ఉండ్రాళ్లయ్యా.. జై జై గణేషా.. అంటూ పూజలందుకునేందుకు గణనాథులు సిద్ధమవుతున్నారు. ఊరూవాడా నవరాత్రి వేడుకలకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా గణేష్ ఉత్సవ కమిటీలు చందాల వసూలు, పందిళ్ల నిర్మాణాలు, వినాయక విగ్రహాలను కొనుగోలు చేసి తీసుకువచ్చే పనుల్లో బిబీబిజీగా ఉన్నారు. పట్టణాల్లోని ప్రధాన కూడళ్లల్లో, గ్రామీణ ప్రాంతాల్లోని వీధుల్లో పందిళ్లు నెలకొల్పుతున్నారు. శనివారం అమావాస్య కావడంతో పందిళ్ల నిర్మాణాలు, ఇతర పనులను ఆదివారం నుంచి ప్రారంభించారు. ప్రస్తుతం అన్నిచోట్లా ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వినాయక చవితి భక్తితో పాటు ఎందరికో భుక్తిని ప్రసాదిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఉత్సవాల నిర్వాహకులు గణేష్ విగ్రహాలను ఇప్పటికే తమకు అనుకూలమైన చోట్లకు తరలించారు. పండుగ రోజు ఉదయం వాటిని తీన్మార్ డప్పు వాయిద్యాలు, బాణసంచా కాల్పుల నడుమ మందిరాల్లోకి చేర్చనున్నారు.
అందరికీ ఉపాధి
కులమతాలతో సంబంధం లేకుండా అందరికీ ఉ పాధి కల్పించే పండుగ వినాయక చవితి. పురోహి తులు, విగ్రహాల తయారీదారులు, షామియానా పందిళ్లు, టెంట్లు నిర్మించే వారు, పత్రి విక్రయించే వారు, తీన్మార్ వాయిద్యకారులు, ఊరేగింపుల్లో వేషాలు వేసే కళాకారులు, డీజే బాక్సుల యజమానులు, డెకరేషన్ వారు, నవరాత్రుల సమయంలో అన్నదానాల్లో వంటలు వండే కార్మికులు ఇలా ఎందరికో ఉపాధి కల్పిస్తుంది. ముఖ్యంగా పురోహితులకు డిమాండ్ అధికం.
27 నుంచి గణపతి నవరాత్రులు
జిల్లావ్యాప్తంగా జోరుగా ఏర్పాట్లు
పందిళ్ల నిర్మాణాల్లో బిజీగా కార్మికులు
ఇప్పటికే బుక్ అయిన డీజే, తీన్మార్ కళాకారులు, పురోహితులు

చవితి కళ..ఉపాధి భళా