
వరద తగ్గుముఖం
పోలవరం రూరల్: గోదావరి వరద శాంతిస్తోంది. దీంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. సుమారు 12 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు చేరడంతో దిగువన వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. క్రమేపీ ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే నీరు తగ్గుముఖం పట్టడంతో పోలవరంలో వరద తగ్గుతోంది. శనివారం సాయంత్రానికి పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 32.270 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి 9.14 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు చేరుతోంది. ఎగువ భద్రాచలం వద్ద కూడా వరద పూర్తిగా తగ్గి 36.20 అడుగులకు చేరుకుంది.
నరసాపురంలో ఉధృతంగా..
నరసాపురం: నరసాపురంలో వశిష్ట గోదావరి ఉధృతి కొనసాగుతోంది. శనివారం కొంతమేర నీటి మట్టం తగ్గినా వలంధర్‌రేవు, లలితాంబఘాట్, పడవల రేవు వద్ద పరిస్థితి ప్రమాదకరంగానే ఉంది. రేవులన్నీ నీటమునిగే ఉన్నాయి. బాపూ ఘాట్ వద్ద నీటిమట్టం తగ్గలేదు. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు అంతే వేగంతో సముద్రంలోకి వెళుతోంది. మాధవాయిపాలెం ఫెర్రీ వద్ద పంటు రాకపోకలు పునరుద్ధరించలేదు. మరో రెండు మూడు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా.