
‘సత్యసాయి’ కార్మికులకు జీతాలివ్వాలి
బుట్టాయగూడెం: సత్యసాయి మంచినీటి పథకం కార్మికులకు 9 నెలలుగా రావాల్సిన జీతాలను వెంటనే చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు. దుద్దుకూరులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మెట్ట ప్రాంతంలో తాగునీటి సరఫరాలో కీలకంగా ఉన్న కార్మికులకు జీతాలు ఆపడం సరికాదన్నారు. సత్యసాయి వాటర్ నిర్మాణం పనుల సమయంలో తాను ఎంతో కృషి చేశానని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా మూడు నియోజకవర్గాల పరిధిలోని 17 మండలాల్లో సుమారు 6 లక్షల మంది వరకూ మంచినీరు సరఫరా అవుతుందన్నారు. అయితే కార్మికులు సమ్మెకు వెళ్లడంతో నీటి సరఫరాకు ఆటంకం కలగవచ్చని, శుద్ధి జలాలు ప్రజలకు అందక అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందన్నారు. కూటమి ప్రభుత్వ పాలకులు, అధికారులు వెంటనే సమస్య పరిష్కారానికి కృషిచేయాలని కోరారు. కార్మికులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గతంలో కార్మికుల సమస్యలపై మాజీ సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లగా జీతాలు, మెయింటెనెన్స్ కోసం సుమారు రూ.13 కోట్లు మంజురు చేశారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 9 నెలలుగా కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడం బాధాకరమని అన్నా రు. సమస్య పరిష్కారమయ్యే వరకూ అన్ని మండలాల్లో కార్మికులకు మద్దతుగా ఆందోళనలు చేపడతామని బాలరాజు హెచ్చరించారు.