
నేత్రపర్వం.. నారసింహుని శాంతి కల్యాణం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన ఐఎస్ జగన్నాధపురంలోని సుందరగిరిపై కొలువైన శ్రీ కనకవల్లి సమేత లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో దివ్య పవిత్రోత్సవాల ముగింపును పురస్కరించుకుని గురువారం విశేష కార్యక్రమాలు జరిగాయి. అందులో భాగంగా స్వామివారి శాంతి కల్యాణం, గరుడ వాహన సేవ, పవిత్రావరోహణ, మహా పూర్ణాహుతి వేడుకలు కన్నులపండువగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో బంగారు శేష వాహనంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి శాంతి కల్యాణాన్ని మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ నేత్రపర్వంగా జరిపారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు బంగారు గరుడ వాహనంపై కోవెల ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలయ ఈఓ ఎన్‌వీ సత్యన్నారాయణ మూర్తి, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. హైదరాబాద్‌కు చెందిన కొచ్చర్లకోట సత్యవెంకట లక్ష్మీనరసింహ గురూజీ సూచనల మేరకు తొలిసారి నిర్వహించిన దివ్య పవిత్రోత్సవాలు స్వామివారి వైభవాన్ని చాటాయి.
సుందరగిరిపై ముగిసిన దివ్య పవిత్రోత్సవాలు