
‘సత్యసాయి’ కార్మికుల సమ్మెబాట
ప్రజాసంఘాల మద్దతుతో..
అభద్రతా భావంతో..
● 9 నెలలుగా నిలిచిన వేతనాలు
● నేటి నుంచి విధులకు దూరం
● 17 మండలాల్లో తాగునీటి సరఫరాకు ఆటంకం
కొయ్యలగూడెం: శ్రీ సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు శుక్రవారం నుంచి సమ్మె బాట పట్టనున్నారు. 9 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో విధులను బహిష్కరించనున్నారు. 2006లో తాగునీటి పథకం ప్రారంభం కాగా కార్మికుల సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదు. వేతన బకాయిలతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా ఉందని పలుమార్లు ప్రాజెక్టు నిర్వాహకులు, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదు. ఈ నేపథ్యంలో 15 రోజుల క్రితం సమ్మె నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టు నిర్వహించే కాంట్రాక్టర్‌కు ప్రభుత్వం నుంచి బకాయిలు రాకపోవడంతో తమకు వేతనాలు చెల్లించడం లేదని కార్మికులు అంటున్నారు. ఈ క్రమంలో నాలుగు నెలలుగా ప్రజాసంఘాల విజ్ఞప్తి మేరకు సామాజిక బాధ్యతతో విధులు నిర్వహించామని, ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్య తీసుకువెళ్లినా స్పందించ లేదని యూనియన్ అధ్యక్షుడు జి.శివ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణ తెలిపారు.
మూడు నియోజకవర్గాల పరిధిలో..
సమ్మెతో పోలవరం, చింతలపూడి, గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 17 మండలాల్లోని సుమారు 6 లక్షల మంది ప్రజలకు తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. పోలవరం మండలం కన్నాపురం అడ్డరోడ్డు వద్ద గోదావరి నుంచి జలాలను పంపింగ్ చేసి గోపాలపురం మండలం హుకుంపేటలో ప్రధాన ట్యాంకుకి సరఫరా చేస్తారు. అక్కడ నీటిని శుద్ధి చేసి ఆయా ప్రాంతాల్లోని ట్యాంకులకు సరఫరా చేస్తారు. వేతన బకాయిలతో పాటు పెండింగ్ పీఎఫ్, ఈఎస్‌ఐ, పథకానికి ప్రత్యేక గ్రాంట్, చనిపోయిన కార్మికుల కుటుంబాలకు సాయం, ఆయా కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, పథకానికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని సంఘ నాయకులు డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు.
ప్రజల ఇబ్బందుల దృష్ట్యా కొద్ది నెలలుగా సమ్మె నిర్ణయం వాయిదా వేసుకున్నాం. అయినా మా కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారడంతో ప్రజాసంఘాల మద్దతుతో తప్పని పరిస్థితుల్లో సమ్మె బాట పట్టాం.
– అంబటి శ్రీనివాస్, పంపు డ్రైవర్, కన్నాపురం
15 ఏళ్లపాటు విధులు నిర్వహించిన కార్మికుడు అనారోగ్యంతో మృతి చెందితే ఎలాంటి సాయం అందలేదు. దీంతో కార్మికుల్లో అభద్రతా భావం నెలకొంది. నెలల తరబడి వేతనాలు రాకపోవడంతో అప్పులు చేసి బతుకున్నాం.
– పిల్లి వీరనాగబాబు, పంపు ఆపరేటర్

‘సత్యసాయి’ కార్మికుల సమ్మెబాట

‘సత్యసాయి’ కార్మికుల సమ్మెబాట