
కూటమికి దివ్యాంగుల ఉసురు తగులుతుంది
● జిల్లాలో 4,736 పింఛన్ల తొలగింపు
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ ధ్వజం
కై కలూరు: కూటమి ప్రభుత్వానికి పింఛన్లు తొలగించిన దివ్యాంగుల ఉసురు తగులుతుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. కై కలూరులోని పార్టీ కార్యాలయంలో జిల్లాలో పింఛన్ల తొలగింపుపై గురువారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 4,736 మంది దివ్యాంగుల పింఛన్లను రద్దు చేశారని, రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఖ్య 1.25 లక్షలకు చేరిందన్నారు. దీంతో దివ్యాంగులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ కన్నీరు కారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కులమతాలు, పార్టీలకు అతీతంగా పథకాలు అందించారన్నారు. అయితే ప్రస్తుత సీఎం చంద్రబాబు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా పథకాలు వర్తింపచేయవద్దని చెప్పారన్నారు. దీంతో గ్రామాల్లో కూటమి నేతలు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులకు పథకాలను తొలగిస్తున్నారని ఆరోపించారు. 10 ఏళ్ల క్రితం 80 శాతం ఉన్న వికలాంగత్వం నేడు 20 శాతానికి ఏలా చేరిందని ప్రశ్నించారు. జిల్లాలోని కూటమి ఎమ్మెల్యేలు కలుగజేసుకుని దివ్యాంగులకు న్యాయం చేయాలని కోరారు. ఎంపీపీలు పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్, చందన ఉమామహేశ్వరరావు, రామిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ మండవల్లి మండలంలో 104, కలిదిండి మండలంలో 147, ముదినేపల్లి మండలంలో 91, కై కలూరు మండలంలో 128 దివ్యాంగ పింఛన్లు తొలగించారన్నారు. ఎంపీటీసీలు, సర్పంచ్‌ల గౌరవ వేతనం ఇవ్వకుండా, వారికి సంక్షేమ పథకాలను తీసివేశారన్నారు. పార్టీ ముదిరాజుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధనరావు మాట్లాడుతూ సంపద సృష్టించడమంటే దివ్యాంగుల పింఛన్లు ఆపడమా? అని ప్రశ్నించారు. రాష్ట్ర మేధావుల ఫోరం కార్యదర్శి బీవీ రావు మాట్లాడుతూ గతంలో వికలాంగత్వాన్ని నిర్ధారించిన డాక్టర్లు ఇప్పుడు వైకల్య శాతాన్ని తగ్గించడం దారుణమన్నారు. మండల పార్టీ అధ్యక్షులు సింగంశెట్టి రాము, బేతపూడి ఏసేబురాజు, బోయిన రామరాజు, నాయకులు సమయం అంజి, పంజా రామారావు, కన్నా రమేష్, పంజా నాగు, మండా నవీన్, బుసనబోయిన శ్రీనివాస్, కన్నా బాబు పాల్గొన్నారు.