
అర్హత ఉన్నా పెన్షన్లు తీసేస్తారా?
దెందులూరు: దెందులూరు నియోజకవర్గంలో అర్హత ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం 842 మంది దివ్యాంగ పెన్షన్లు తొలగించడం దారుణమని, ఇది మంచి ప్రభుత్వమా? అని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. దివ్యాంగులని కూడా చూడకుండా పెన్షన్లు రద్దు చేస్తే వారు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ఎలా జీవిస్తారని ప్రశ్నించారు. పెదవేగి మండలంలో 342, పెదపాడు మండలంలో 145, దెందులూరు మండలంలో 260 పెన్షన్లు, ఏలూరు రూరల్ మండలంలో 95 పెన్షన్లు రద్దు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు నియోజకవర్గంలో దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసుల బనాయింపు, శిలాఫలకాలు, విగ్రహాలు పగలగొట్టడం చేశారన్నారు. ఏడో మైలురాయి వద్ద ప్రభాకర్ ఎమ్మెల్యే అయినప్పటి శిలాఫలకాలు ఇప్పటికీ ఉన్నాయని, మా శిలాఫలకాలు ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. నియోజకవర్గంలో తన పేరు కనపించినా, ఫోటో కనిపించినా ఎమ్మెల్యే ప్రభాకర్‌కు నిద్ర పట్టడం లేదన్నారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మేక లక్ష్మణరావు, వడ్డీలు కార్పొరేషన్ మాజీ చైర్మన్ ముంగర సంజీవ్ కుమార్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు తేరా ఆనంద్, జెడ్పీటీసీ నిట్టా లీలానవకాంతం, ఎంపీపీ బత్తుల రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.