జీజీహెచ్‌లో మాయాజాలం | - | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌లో మాయాజాలం

Aug 20 2025 12:34 PM | Updated on Aug 20 2025 12:34 PM

జీజీహ

జీజీహెచ్‌లో మాయాజాలం

రూ.24 లక్షల నిధులు ఎక్కడ?

న్యాయం చేయాలి

కార్మికుల పొట్టకొడుతున్నారు

ఏలూరు టౌన్‌: ఏలూరు సర్వజన ఆసుపత్రిలో నిధుల స్వాహా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులను తోసిరాజని శానిటరీ వర్కర్లకు అన్యాయం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెతుతున్నాయి. రెండు, మూడేళ్ళుగా ఏలూరు జీజీహెచ్‌ వైద్యాధికారులు శానిటరీ వర్కర్లకు ఇవ్వాల్సిన ఆరోగ్యశ్రీ ఇన్సెంటివ్స్‌ ఇవ్వకుండా ఆ నిధులను పక్కదారి పట్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏకంగా రూ.24 లక్షలకు పైగా సొమ్ములు ఏమయ్యాయో తెలియడం లేదని, తమకు న్యాయంగా చెల్లించాల్సిన సొమ్ములు ఇవ్వాలని కోరుతున్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో స్టాఫ్‌ నర్సులకు చెల్లించాల్సిన 15 శాతం ఇన్సెంటివ్స్‌లోనూ కోత పెట్టారని, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని స్థితిలో ఉన్నామని వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శానిటరీ వర్కర్లపై చిన్నచూపు

వైద్య విధాన పరిషత్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ నిబంధనల మేరకు.. ఆరోగ్యశ్రీ పథకంలో రోగికి సేవలందిస్తోన్న వైద్యుడు నుంచి కింది స్థాయి ఉద్యోగి ఇన్సెంటివ్స్‌ చెల్లించాల్సి ఉంది. ఏలూరు జీజీహెచ్‌లో సుమారుగా 95 మంది వరకూ శానిటరీ వర్కర్లు పనిచేస్తున్నారు. వీరంతా జీజీహెచ్‌లోని ఆయా విభాగాల్లో రోగులకు సేవలందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో రోగికి ఇచ్చే సొమ్ములో 45 శాతం వివిధ కేటగిరీల్లో ఇన్సెంటివ్‌ చెల్లించాల్సి ఉంది. దీనిలో 20 శాతం ఎఫ్‌ఎంఓ, ఎన్‌ఎన్‌ఓ, స్ట్రెచర్‌ బాయ్‌, తోటి(శానిటరీ వర్కర్‌), ఆయా, ప్లంబర్‌, బార్బర్‌, లిఫ్ట్‌ అపరేటర్‌ ఇలా వివిధ కేటగిరీలో పనిచేస్తున్న సిబ్బందికి చెల్లించాలి. ఏపీ వైద్య విధాన పరిషత్‌ ఏర్పడిన అనంతరం తోటి అనే పదాన్ని రద్దు చేయగా, జూనియర్‌ శానిటరీ వర్కర్‌గా మార్చారు. ప్రస్తుతం ఈ పోస్టు శానిటరీ వర్కర్‌గా మారగా, వీరంతా శానిటరీ కాంట్రాక్టర్‌ వద్ద పనిచేస్తున్నారు. హాస్పిటల్‌లో పనిచేసే శానిటరీ వర్కర్లు ఆరోగ్యశ్రీ వార్డుల్లో రోగులకు సేవలందిస్తూ ఉంటారు.

స్టాఫ్‌ నర్సులకు కోత : రోగికి చెల్లించే సొమ్ములో సేవలు అందించే వైద్యుడు, స్టాఫ్‌ నర్సులకు పెద్ద మొత్తంలోనే సొమ్ము చెల్లిస్తారు. స్టాఫ్‌ నర్సుకు సుమారుగా 15 శాతం చొప్పున డబ్బులు ఇవ్వాలి. శస్త్రచికిత్సలు, ఇతర సేవలకు స్టాఫ్‌ నర్సులకు సుమారుగా రూ.15 వేలకు పైగా ఇవ్వాల్సి ఉంటుంది. ఏలూరు జీజీహెచ్‌లో కేవలం రూ.4500 మాత్రమే ఇస్తున్నారు. స్టాఫ్‌ నర్సులకు చెల్లించాల్సిన 15 శాతంలో కేవలం 5 శాతం మాత్రమే ఇస్తూ.. మిగిలిన సొమ్ములు ఎవరి ఖాతాల్లోకి వెళ్తున్నాయనేది సందేహంగా మారింది. స్టాఫ్‌ నర్సులకు ఇవ్వాల్సిన సొమ్ముల్లో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

ఆరోగ్యశ్రీ ఇన్సెంటివ్స్‌ చెల్లించకుండా స్వాహా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఏలూరు జీజీహెచ్‌లో శానిటరీ వర్కర్లకు కనీసం 6 నెలలకు రూ.4 లక్షల వరకూ ఆరోగ్యశ్రీ ఇన్సెంటివ్స్‌ సొమ్ములు చెల్లించాలి. మూడేళ్ళ పాటు సుమారుగా రూ.24 లక్షల వరకూ నిధులు ఏమయ్యాయో ప్రశ్నార్థకంగా మారింది. ఒక్కో శానిటరీ వర్కర్‌కు సుమారుగా రూ.4 వేల వరకూ ఇన్సెంటివ్స్‌ ఇవ్వాల్సి ఉంది.

మూడేళ్లుగా శానిటరీ వర్కర్లకు అందని ఇన్సెంటివ్‌ సొమ్ము

మొత్తం రూ.24 లక్షలు స్వాహా చేశారని ఆరోపణలు?

స్టాఫ్‌ నర్సులకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్‌లో కోత

15 శాతానికి 5 శాతమే ఇస్తున్నారని ఆవేదన

జీజీహెచ్‌లో శానిటరీ వర్కర్లకు ఆరోగ్యశ్రీ సేవలకు ఇన్సెంటివ్స్‌ చెల్లించాల్సి ఉంది. మూడేళ్ళుగా చెల్లించడం లేదు. కనీసం రూ.24 లక్షల వరకూ ఇన్సెంటివ్స్‌ రావాల్సి ఉంది. ఆరోగ్యశ్రీ సేవల్లో భాగంగా రోగులకు ఎన్నో సేవలు అందిస్తున్న శానిటరీ వర్కర్లకు అన్యాయం చేస్తే సహించేది లేదు. జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్ళి న్యాయం జరిగేలా ఉద్యమిస్తాం.

– కే.కృష్ణమాచార్యులు, ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు

నిత్యం ఏలూరు జీజీహెచ్‌లో రోగులకు సేవలందిస్తూ ఉంటాం. ఆరోగ్యశ్రీ వార్డుల్లో ఆపరేషన్లు చేసిన రోగులకు, ఇతర వ్యాధులతో బాధపడేవారికి సేవలు అందిస్తున్నాం. ప్రభుత్వం మాకు ఇచ్చే సొమ్ములు మాత్రం ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. చాలీచాలని జీతాలతో, ఐదారు నెలలకు ఒకసారి జీతాలు ఇచ్చినా పనిచేస్తున్నాం. న్యాయంగా రావాల్సిన సొమ్ములు ఇచ్చేలా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి.

– విజయ, శానిటరీ వర్కర్‌, ఏలూరు జీజీహెచ్‌

జీజీహెచ్‌లో మాయాజాలం 1
1/2

జీజీహెచ్‌లో మాయాజాలం

జీజీహెచ్‌లో మాయాజాలం 2
2/2

జీజీహెచ్‌లో మాయాజాలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement