
పామాయిల్ కార్మికులను ఆదుకోవాలి
ఏలూరు (టూటౌన్): పామాయిల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు పి.రామకృష్ణ డిమాండ్ చేశారు. పామాయిల్ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. అనంతరం పామాయిల్ కార్మికుల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఇటీవల పామాయిల్ కార్మికులు విద్యుత్ షాక్ తగిలి, విష పురుగులు కాటేసి చనిపోతున్నారన్నారు. ఏలూరు ఎంపీ పామాయిల్ రైతుల గురించి మాట్లాడుతున్నారు తప్ప పామాయిల్ కార్మికుల గురించి మాట్లాడకపోవడం సిగ్గు చేటన్నారు. పామాయిల్ కార్మికుల సంక్షేమానికి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో చనిపోయిన కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరారు. వికలాంగులుగా మారిన వారికి ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పామాయిల్ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తుమ్మల సత్యనారాయణ, జిల్లా నాయకులు ఎం.సత్యనారాయణ, హరీష్, ఎం.లక్ష్మణ, ఎం.రాంబాబు, టీ సుబ్బారావు పాల్గొన్నారు.