
నేటినుంచి కోర్టుల్లో ఉద్యోగాలకు పరీక్షలు
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కోర్టులలో స్టెనోగ్రాఫర్స్, టైపిస్ట్, కాపీయిస్ట్, డ్రైవర్, తదితర పోస్టులకు జారీ చేసిన నోటిఫికేషన్‌కు 4,207 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని, వీరికి ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి తెలిపారు. స్థానిక జిల్లా జడ్జి ఛాంబర్‌లో మంగళవారం పరీక్షల నిర్వహణ వివరాలు జిల్లా జడ్జి వెల్లడించారు. ఏలూరులోని సీఆర్‌ఆర్. ఇంజనీరింగ్ కాలేజీ, సిద్దార్థ క్వెస్ట్ కళాశాల, భీమవరంలోని డీఎన్‌ఆర్ కళాశాల కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్ష ఆన్‌లైన్ విధానంలో ఉంటుందన్నారు. ఈనెల 20, 21, 22, 24 తేదీల్లో మూడు షిప్టులలో, 23వ తేదీన రెండు షిప్టులలో పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులను నిర్ధేశించిన సమయానికి 15 నిమిషాల ముందు మాత్రమే పరీక్షా కేంద్రంలోని అనుమతించడం జరుగుతుందన్నారు. విభిన్న ప్రతిభావంతులకు వారి విజ్ఞప్తి మేరకు స్క్రైబ్‌ని ఏర్పాటుచేయడం జరుగుతుందని, వారిని నిర్ధేశించిన సమయం కన్నా 30 నిమిషాలు అదనపు సమయం ఇవ్వడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటుగా తప్పనిసరిగా ఫోటో గుర్తింపు కార్డును తీసుకురావాలన్నారు. హాల్‌టికెట్ డౌన్‌లోడ్‌లో సాంకేతిక సమస్యలు, తదితర సమస్యల పరిష్కారం కోసం 0863–2372752 ఫోన్ నెంబర్‌తో హెల్ప్ లైన్ ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. రత్నప్రసాద్ పాల్గొన్నారు.
ఏలూరులో రెండు, భీమవరంలో ఒకటి పరీక్షా కేంద్రాలు
జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి వెల్లడి