
శ్రీనివాసుడి దివ్య పవిత్రోత్సవాలు ప్రారంభం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ, వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీనివాసుడి దివ్య పవిత్రోత్సవాలు సోమవారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాన్ని జరిపి, ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆలయంలో ఏడాది పొడవున తెలిసీ, తెలియక జరిగిన తప్పుల ప్రాయఃశ్చిత్తం నిమిత్తం ఈ పవిత్రోత్సవాలను నిర్వహించడం ఇక్కడ సంప్రదాయం. దివ్య పవిత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం పవిత్రాధివాసం, బుధవారం పవిత్రారోహణ కార్యక్రమాలు జరుగుతాయని, గురువారం జరిగే పవిత్రావరోహణ, మహా పూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయని శ్రీవారి ఆలయ ఈఓ ఎన్‌వీ సత్యనారాయణ మూర్తి తెలిపారు.