ఆపరేషన్ సిందూర్‌లో నేను సైతం
ఏలూరు టౌన్/పెదపాడు: దేశం తనకేమి చేసిందనేది కాకుండా... దేశానికి తాను సేవ చేయాలనే దృఢ సంకల్పంతో సైన్యంలో చేరిన హవల్దార్ మేకా శివాజీ ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొని స్వగ్రామం వట్లూరు వచ్చారు. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొని తొలిసారి స్వగ్రామానికి వచ్చిన శివాజీకి వట్లూరు కబడ్డీ యూత్, గ్రామస్తులు, ఉపాధ్యాయులు, స్నేహితులు కలపర్రు టోల్‌ప్లాజా నుంచి ఘనస్వాగతం పలికారు.
భారీ ర్యాలీగా గ్రామానికి తీసుకెళ్లారు. వట్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శివాజీకి సన్మానం చేశారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన మేకా పోతురాజు, రాజ్యం దంపతుల కుమారుడు శివాజీ. ఆయనకు భార్య స్వాతి, కుమార్తె నిత్య, కుమారుడు భరత్ ఉన్నారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్‌లో అమృత్‌సర్ నుంచి యుద్ధంలో పాల్గొన్నానని శివాజీ తెలిపారు. కోట్లాది మంది భారతీయుల తరపున యుద్ధంలో పాల్గొనటం గర్వంగా ఉందన్నారు.
ఆపరేషన్ సిందూర్‌లో నేను సైతం


