అన్నదాతా దుఃఖీభవ !
రైతుకు ఏడాదికి రూ.20 వేల సాయం.. ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటుచేసి మద్దతు ధరలకు పంటల కొనుగోలు.. 9 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా.. ఆక్వాకు విద్యుత్ రాయితీలు.. రైతుసేవా కేంద్రాల ద్వారా సేవలు.. ఇవన్నీ గతేడాది ఎన్నికల సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇచ్చిన హామీలు.. తీరా చూస్తే గద్దెనెక్కి ఏడాది గడిచినా ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. దీనికితోడు ప్రధాన పంటల ధరలు భారీగా తగ్గుతున్నా పట్టించుకోవడం లేదు. కూటమి పాలనలో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేయగా.. ప్రస్తుత కూటమి సర్కారు కర్షకులపై నిండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
దగాపడ్డ రైతన్న
● కూటమి ఏడాది పాలనలో రైతులకు ఇక్కట్లు
● రూ.471.69 కోట్ల అన్నదాత సుఖీభవ ఎగనామం
● కోకో ధరలు నేలచూపులు
● ధాన్యం కొనుగోళ్లలో దళారులరాజ్యం
● మామిడి రైతుల డీలా
● రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం
● గత ప్రభుత్వంలో రూ.1,830 కోట్ల రైతు భరోసా అందజేత
● సకాలంలో పంట నష్టపరిహారాలు, రాయితీలు
గత ప్రభుత్వంలో పెద్దపీట
గత జగన్ సర్కారులో అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేశారు. 2.35 లక్షల మంది రైతులకు రూ.1,830 కోట్ల రైతు భరోసా, 97,584 మంది రైతులకు సున్నా వడ్డీ కింద రూ.22.29 కోట్లు అందించారు. జిల్లాలో 70,960 వ్యవసాయ కనెక్షన్లకు 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరాకు రూ.2,467.25 కోట్లు వెచ్చించారు. తుపానులు, విపత్తులకు సంబంధించి పంట నష్టపరిహారాన్ని రోజుల వ్యవధిలో అందించి అండగా నిలిచారు.


