జీఈఏ జాయింట్ సెక్రటరీగా జాన్‌బాబు
ఏలూరు టౌన్: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా జాయింట్ సెక్రటరీగా జీ.జాన్‌బాబు ఎన్నికయ్యారు. ఈనెల 25న ఏలూరులోని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ భవన్‌లో జిల్లా కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా రామకృష్ణ, కార్యదర్శిగా బంగారయ్య ఎన్నికయ్యారు. ఈ నూతన కమిటీలో జిల్లా జాయింట్ సెక్రటరీగా జాన్‌బాబు ఎన్నిక కావటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
ఈఏపీ సెట్‌కు 934 మంది హాజరు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏపీ ఈఏపీ సెట్ పరీక్షల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పరీక్షకు సోమవారం మూడు పరీక్షా కేంద్రాల్లో 974 మందికి 934 మంది హాజరయ్యారు. ఉదయం సెషన్‌లో సిద్ధార్థ క్వెస్ట్ పరీక్షా కేంద్రంలో 161 మందికి 153 మంది హాజరు కాగా, మధ్యాహ్నం సెషన్‌లో 162 మందికి 154 మంది హాజరయ్యారు. ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం సెషన్‌లో 150 మందికి 147 మంది హాజరు కాగా, మధ్యాహ్నం 150 మందికి 144 మంది హాజరయ్యారు. సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 178 మందికి 171 మంది హాజరు కాగా, మధ్యాహ్నం 173 మందికి 165 మంది హాజరయ్యారు.
సబ్సిడీపై విత్తనాలు ఇవ్వాలి
ఏలూరు (టూటౌన్): జిల్లాలో ఖరీఫ్ పంటకు సంబంధించి రైతులు, కౌలు రైతులకు విత్తనాలను 75 శాతం సబ్సిడీపై సకాలంలో అందజేయాలని కలెక్టర్‌కు రైతు సంఘం నాయకులు మెమోరాండం సమర్పించారు. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాయంకుల లక్ష్మణరావు మాట్లాడుతూ రైతులకు సంబంధించి ఖరీఫ్ పంటకు విత్తనాలు కొరత లేకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. సాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కోకో, వరితో పాటు ఇతర వాణిజ్య పంటలకు గిట్టుబాటు ధరలు అందేలాగా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. వరి, వేరుశెనగ, మినుము, పెసర, పత్తి, మిర్చి, కందులు తదితర పంటలకు 75 శాతం సబ్సిడీతో విత్తనాలు అందించాలని కోరారు. తక్షణమే కోకో పంటకు గిట్టుబాటు ధర ప్రకటించి కోకో గింజలను రైతులు నుంచి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో రైతు సంఘం జిల్లా నాయకులు కూచిపూడి నాగేశ్వరరావు, చలసాని జగన్‌మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం
ఏలూరు (టూటౌన్): పీజీఆర్‌ఎస్‌లో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ సర్పంచుల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మెండెం సంతోష్‌కుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసారు. దెందులూరు మండలం ముప్పవరం పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్న అధికారులపై ఫిర్యాదు చేసి.. అభివృద్ధిని ముందుకు కొనసాగించాలని కోరారు. సర్పంచ్ హక్కులు, విధులకు ఆటంకాలు కలిగించకుండా చూడాలని, గ్రామాలలో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పనులు పూర్తి చేయని పక్షంలో మరోసారి కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చి అనంతరం న్యాయపోరాటానికి సిద్ధమవుతామన్నారు.
శ్రీవారి దేవస్థానానికి ఏఈఓ బదిలీ
ద్వారకాతిరుమల: విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఏఈఓగా విధులు నిర్వర్తిస్తున్న మెట్టపల్లి దుర్గారావును మాతృ సంస్థ అయిన ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానానికి బదిలీ చేస్తూ రాష్ట్ర దేవదాయశాఖ అదనపు కమిషనర్ టి.చంద్ర కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సొసైటీ భూమి
రీ సర్వేకు వినతి
కై కలూరు: జాన్‌పేట ప్రజలకు ఫిషర్‌మేన్ కోఆపరేటీవ్ సొసైటీ పేరుతో 1975లో కేటాయించిన భూమిని అటవీశాఖ స్వాధీనం చేసుకుందని, తిరిగి రీసర్వే చేయాలని మాదిగ దండోరా, ఎమ్మార్పీఎస్ కమిటీ సభ్యులు కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో సోమవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మానవ హక్కుల కార్యకర్త వంగలపూడి విజయ్ మాట్లాడుతూ డీ–ఫాం పట్టాల రూపంలో ప్రభుత్వం జాన్‌పేట గ్రామస్తులకు భూమిని కేటాయించిందన్నారు. 2006లో కొల్లేరు ఆపరేషన్ సందర్భంగా అటవీశాఖ అధికారులు బౌండరీ పిల్లర్స్ తప్పుగా వేసి ఈ భూమిని కాంటూరు లోపలిగా చూపించి స్వాధీనం చేసుకున్నారన్నారు.


