పోలీస్ డాగ్ స్క్వాడ్‌కు నూతన భవనం
ఏలూరు: పోలీస్ డాగ్స్‌కు నూతన భవనాన్ని నిర్మించడం అభినందనీయమని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ అన్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన పోలీస్ డాగ్ స్క్వాడ్ భవనాన్ని ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్‌తో కలిసి ఐజీ అశోక్‌కుమార్ ప్రారంభించారు. తొలుత పోలీస్ సిబ్బంది ఐజీకి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నేరాల దర్యాప్తులో పోలీస్ డాగ్ స్క్వాడ్ పాత్ర కీలమన్నారు. ఎస్పీ శివకిషోర్ మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూనే నేరాలకు పాల్పడే వారికి శిక్షలు పడేలా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఏఆర్ అదనపు ఎస్పీ ఎస్‌ఎస్‌ఎస్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
గృహ నిర్మాణ లక్ష్యాలు సాధించాలి
ఏలూరు(మెట్రో): గృహ నిర్మాణాల బిల్లుల మంజూరులో అవినీతికి ఆస్కారం లేకుండా పని చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి శనివారం గృహ నిర్మాణ సిబ్బంది, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వార్డు ఎమెనిటిస్‌తో గృహ నిర్మాణ ప్రగతిపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ వారంలో నిర్దేశించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతిపై సమీక్షించారు. నూజివీడు డివిజన్‌లోని మండలాల ప్రగతిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గృహనిర్మాణ విషయంలో రాష్ట్రంలో ఏలూరు జిల్లాను 3వ స్థానం నుంచి 2వ స్థానానికి తీసుకురావడానికి మరింత కష్టపడి పనిచేయాలని ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్‌లో గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి జి.సత్యనారాయణ, ఉప కార్య నిర్వాహక ఇంజినీర్లు పాల్గొన్నారు.
ఈఏపీ సెట్ పరీక్షకు 474 మంది హాజరు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్ పరీక్షల్లో నిర్వహించిన పరీక్షలకు శనివారం మూడు పరీక్షా కేంద్రాల్లో 489 మందికి 474 మంది హాజరయ్యారు. ఉదయం సెషన్‌లో సిద్ధార్థ క్వెస్ట్ పరీక్షా కేంద్రంలో 162 మందికి గాను 157 మంది హాజరు కాగా, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం సెషన్‌లో 150 మందికి 144 మంది హాజరయ్యారు. సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 177 మందికి 173 మంది హాజరు కాగా నలుగురు గైర్హాజరయ్యారు.
లెదర్ కోర్సుల్లో శిక్షణకు ఆహ్వానం
ఏలూరు (టూటౌన్): జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ యువతకు లిడ్‌కాప్–సీడ్‌యాప్ ద్వారా వివిధ కోర్సులలో శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఒక ప్రకటనలో తెలిపారు. లెదర్ స్టిచింగ్ ఆపరేటర్–లెదర్ ఫుట్ వేర్, లెదర్ కట్టర్ ఫుట్‌వేర్‌లో శిక్షణ ఇస్తారన్నారు. ఈ నెల 26లోగా దరఖాస్తు చేసుకోవాలని.. అభ్యర్థులు 9494174417, 7981438585, 94944 77597 నెంబర్లలో సంప్రదించాలన్నారు.
‘పది’ సప్లిమెంటరీ పరీక్షలకు 3,016 మంది హాజరు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఎస్‌ఎస్‌సీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో శనివారం జరిగిన జీవశాస్త్రం పరీక్షకు మొత్తం 4,306 మంది హాజరు కావాల్సి ఉండగా 3,016 మంది హాజరయ్యారు. 1290 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షలను జిల్లా విద్యాశాఖాధికారి ఒక పరీక్షా కేంద్రంలో, ఫ్లయింగ్ స్క్వాడ్ 17 పరీక్షా కేంద్రాల్లో, ప్రభుత్వ పరీక్షల సహాయ కమీషనర్ 2 కేంద్రాల్లో తనిఖీ చేశారు.
ఆక్వా క్రాప్ హాలిడేకు సిద్ధమవ్వాలి
పాలకొల్లు సెంట్రల్: క్రాప్ హాలిడే దిశగా ఆక్వా రైతులు సమాయత్తమవుతున్నారని జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీభగవాన్ రాజు అన్నారు. శనివారం స్థానిక జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం భవనంలో మాట్లాడుతూ జులై, ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో నిర్వహించనున్న క్రాప్ హాలిడేకు ఇప్పటి వరకూ ఆక్వా పట్టుబడులు చేసిన రైతులు తమ చెరువులను ఎండపెడుతున్నారని చెప్పారు. పాలకొల్లు, ఆచంట, నరసాపురం నియోజకవర్గాల్లో ప్రతి గ్రామానికి చెందిన ఆక్వా రైతులందరూ క్రాప్ హాలిడేకు సిద్ధమవుతున్నారని చెప్పారు.


