జిల్లాలు దాటి మట్టి అక్రమ రవాణా
పోలవరం రూరల్ : జిల్లాలు దాటి మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం హుకుంపేట గ్రామ పరిసర ప్రాంతాల నుంచి ఏలూరు జిల్లా పోలవరంలోని ఇటుక బట్టీలకు మట్టిని లారీల్లో అక్రమంగా తరలిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి రవాణా చేయడంపై స్థానికులు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో మార్గమధ్యలో వీఆర్వో మట్టి లారీలను ఆపి తనిఖీలు చేశారు. లారీలకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేవని గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు లారీలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. లారీలను ఆపిన సమయంలో మట్టి రవాణా చేస్తున్న వ్యక్తులు రెవెన్యూ, పోలీసు సిబ్బందిపై కొంత సేపు ఘర్షణకు దిగారు. ఈ ఘటనపై పోలవరం తహసీల్దార్ సాయిరాజును అడగ్గా మట్టి రవాణా చేస్తున్న లారీలకు సంబంధించి జరిమానా విఽధిస్తామన్నారు. చట్టవ్యతిరేకంగా మరోసారి మట్టి రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడమే కాక కేసులు నమోదు చేస్తామన్నారు.


