
దళిత కుటుంబం ఆమరణ నిరాహార దీక్ష
బుట్టాయగూడెం: తమకు న్యాయం చేయాలని కోరుతూ ఓ దళిత కుటుంబం సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆ కుటుంబానికి చెందిన బాషా శ్యామ్‌బాబు, బాషా రాజేష్ మాట్లాడుతూ బుట్టాయగూడెం మండలం మర్రిగూడెం సమీపంలో సర్వే నంబర్ 415లో 10–58 సెంట్లు, సర్వే నంబర్ 415లో 4 ఎకరాల 28 సెంట్లు, సర్వే నంబర్ 417/1లో 8–50 సెంట్లు మొత్తం 23 ఎకరాల 36 సెంట్ల భూములు తమ తాతల కాలం నాటివని అన్నారు. 2002, 2006 సంవత్సరాల్లో బుట్టాయగూడెం రెవెన్యూ అధికారులు పంచనామా చేసి ఆ భూములను తమకు అప్పగించారని, అప్పటి నుంచి ఆ భూముల్లో తామే సాగు చేసుకుని జీవిస్తున్నామని తెలిపారు. ఈ భూముల్లో కొందరు ప్రవేశించి తమను బెదిరిస్తున్నారని, ఆ భూముల్లో ఉన్న జీడిమామిడి, మామిడి పంటలను దౌర్జన్యంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేసే వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ దీక్షలో వెంకాయమ్మ, వేములూరి నాగేంద్ర, వేములూరి వెంకటలక్ష్మి, ముకుంద, బాషా నాగేశ్వరరావు, పాల్గొన్నారు.