రాష్ట్రంలో అధ్వానంగా శాంతిభద్రతలు
చింతలపూడి: రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వానంగా మారాయని పౌర హక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పిడపర్తి ముత్తారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం చింతలపూడిలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మీడియాపై దాడులు ఎక్కువయ్యాయని అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రాణాలకు తెగించి వార్తలు సేకరించే జర్నలిస్టులపై భౌతిక దాడులు చేస్తుండడం దారుణమని అన్నారు. ఇటీవల ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో కలిసి వెళ్లి ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయం ముందు హల్‌చల్ చేయడమే కాక ఆయన అనుచరులు అక్కడి కంప్యూటర్లను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా ప్రవర్తించిన చింతమనేనిపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోకపోవడం శోచనీయమన్నారు. అదే విధంగా శ్రీకాళహస్తిలో వార్త సేకరణకు వెళ్లిన సాక్షి విలేకరిపై జరిగిన దాడి కూడా మీడియాపై దాడులకు ప్రత్యక్ష నిదర్శనం అన్నారు. ఈ దాడులు భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపించారు. నిత్యం మీడియాపై, మీడియా సంస్థలపై, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను దేశంలోని మేధావులు ఖండించాలని పిలుపునిచ్చారు.


