ఇళ్ల కూల్చివేతపై భగ్గుమన్న పేదలు
బొండాడలో ఉద్రిక్తత
కాళ్ల: బొండాడలోని మెయిన్‌రోడ్డులో పేదల ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది. గురువారం ఉదయం 9 గంటల సమయంలో పోలీసుల సమక్షంలో పంచాయతీ అధికారులు గ్రామంలోని 28 ఇళ్లను కూల్చేందుకు పొక్లెయిన్‌ను తీసుకురాగా పేద బాధితులు, సీపీఎం మండల కార్యదర్శి గొర్ల రామకృష్ణ ప్రతిఘటించారు. ఈ సమయంలో పోలీసులు, బాధితుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆకివీడు సీఐ జగదీశ్వర్‌రావు, ఆకివీడు, భీమవరం రూరల్, కాళ్ల ఎస్సైలు, పోలీసులు, పోలీసుల బందోబస్తుతో పేదలు, బాధితులను నిర్బంధించారు. సీపీఎం నేత రామకృష్ణను అరెస్ట్ చేసి కాళ్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం పొక్లెయిన్‌తో ఇళ్లను కూల్చివేశారు. దీంతో మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కూల్చివేతను అడ్డుకుంటున్న మహిళలను పోలీసులు ఓ చోట నిర్బంధించారు. మహిళలు అని కూడా చూడకుండా దౌర్జన్యం చేయడం అన్యాయమని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. బొండాడలో తొలగించిన ఇళ్లకు ఆనుకుని ఇరిగేషన్ పోరంబోకు భూమి 79 సెంట్లు ఉందని, అక్కడ పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.


