ఉపాధి కార్మికుల వేతన బకాయిలు విడుదల చేయాలి
భీమడోలు: ఉపాధి కార్మికులకు రెండు నెలలుగా రావాల్సిన వేతన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు అన్నారు. భీమడోలు సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మండల కమిటీ సమావేశానికి మండల నాయకులు కె.వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు చేసిన వేలాది మంది కార్మికులకు గత మూడు నెలలుగా ఒక్క రూపాయి వేతనం ఇవ్వకపోవడంతో వారంతా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎండీఎం నిర్వాహకులకు రెండు నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. చిరుద్యోగులు, కూలీల వేతన బకాయిలను నెలల తరబడి పెండింగ్ పెట్టడం దారుణమన్నారు. తక్షణమే వేతన బకాయిలను విడుదల చేయకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కట్టా భాస్కరరావు, శ్రీనివాస్, పద్మ, భారతి, బేబి, బీబీ తదితరులు పాల్గొన్నారు.


