పెళ్లి మండపాలకు పెరిగిన డిమాండ్
తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ కల్యాణ మండపం చూసినా రంగు రంగుల విద్యుద్దీపాలతో కళకళలాడుతున్నాయి. సోమవారం నుంచి ఏప్రిల్ 20 వరకు వివాహ ముహూర్తాలు అధికంగా ఉన్నాయి. రాత్రి ఏడు గంటలు దాటిన ముహూర్తం దగ్గర నుంచి తెల్లవారుజాము ముహూర్తాలు ఉండడంతో ఒక్కసారిగా కల్యాణ మండపాలకు గిరాకీ పెరిగింది. గూడెం ప్రాంతంలో చిన్నా పెద్దా కలిపి 20 వరకు కల్యాణ మండపాలు ఉన్నాయి. కనీస ఽఅద్దె రూ.30 వేలు ఉంటుంది. వీటికి తోడు విద్యుత్, క్లీనింగ్ చార్జీలు, డీజిల్ ఖర్చులు అదనంగా చెల్లించాలి. గూడెంలో చినతాడేపల్లి రోడ్డులో నూతనంగా నిర్మించిన కల్యాణ మండపానికి ఖర్చులతో కలిపి రూ.5 లక్షలకు పైగా వసూలు చేస్తున్నారు. రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు మధ్యతరహ హంగులున్న కల్యాణ మండపాలకు అద్దెలు ఇస్తున్నారు. మరో వైపు బ్యాండ్ ధరలు మోత మోగుతున్నాయి. పెళ్లి కొడుకు చేయడానికి నలుగురు వాద్యకారులు కావాలంటే రూ.6 వేల వరకు ఇవ్వాల్సి వస్తోంది. తంతు జరిపించడం కోసం పురోహితులు దక్షిణలు బాగా చెల్లిస్తేనే పెళ్లిళ్లు చేయడానికి అంగీకరిస్తున్నారు. పూల డెకరేషన్‌ల ధరలు మండిపోతున్నాయి. పూల మండపానికి కనీసం రూ.17 వేలు వసూలు చేస్తున్నారు. కల్యాణ మండపానికి రూ. 60 వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. దేవాలయాల వద్ద పెళ్ళిళ్లు చేసేవారు ఈ సీజన్‌లో పెరిగారు. పట్టణంలో సత్యనారాయణస్వామి ఆలయంలో వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీకి కనీసం రూ.60 వేల నుంచి అడుగుతున్నారు. ఈ నెలలో ఒక వారంలోనే అధిక ముహూర్తాలుండటంతో కల్యాణమండపాలు ఖాళీగా లేవు.


