తాడేపల్లిగూడెం రూరల్: శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో మే 18 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న శిక్షణా కార్యక్రమానికి తాడేపల్లిగూడెం మండలం దండగర్ర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థినులు మైనం ప్రదీప్తి, వీరమళ్ల పద్మశ్రీ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని బుధవారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీహెచ్.చంద్రశేఖర్ తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (ఐఐఆర్‌ఎస్) సంయుక్తంగా దేశ వ్యాప్తంగా తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. ప్రధానంగా ఉపగ్రహాలు, రాకెట్ల తయారీ, క్రయోజెనిక్ టెక్నాలజీ, రిమోట్ సెన్సింగ్, మినరాలజీ మ్యాపింగ్, డీప్ స్పేస్ నెట్ వర్క్, రేడియో టెలిమెట్రి ట్రాకింగ్, లాండర్స్, రోవర్లు, స్పేస్ ప్రోబ్స్, గగన్యాన్ వంటి వాటిపై శాస్త్రవేత్తలతో ముఖాముఖీ, శిక్షణ కార్యక్రమం జరుగుతుందన్నారు. దేశ వ్యాప్తంగా 1.50 లక్షల మంది రిజిస్ట్రేషన్ కాగా, 350 మందిని ఇస్రో ఎంపిక చేసిందన్నారు. వీరిలో తమ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపిక కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.


