సంఖ్యా బలం లేకే కూటమి కుట్రలు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్
కై కలూరు: వైస్ ఎంపీపీ ఎన్నికల్లో ఎంపీటీసీల సంఖ్యా బలం దమ్ములేక కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) విమర్శించారు. కై కలూరు తాలూకా సెంటర్ మండల పరిషత్ కార్యాలయం ఎదుట గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి నేతలు రౌడీయిజం ప్రదర్శిస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో కై కలూరు మండలంలో 22 మంది ఎంపీటీసీ సభ్యుల్లో కేవలం ఒక్కటి మాత్రమే టీడీపీ గెలిచిందన్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన వైస్ ఎంపీపీ–2 మరణిస్తే ప్రస్తుత ఎన్నికలు అనివార్యమయ్యాయన్నారు. వైఎస్సార్‌సీపీ పార్టీ గుర్తుతో గెలిచిన ఎంపీటీసీలను ప్రలోభాలతో కూటమిలో చేర్చుకున్నారన్నారు. భుజబలపట్నం సెగ్మెంట్‌కు చెందిన వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ పెన్మత్స సూర్యనారాయణరాజును ఓటు వేయడానికి రాకుండా కూటమి నేతలు ఇంటికి తాళాలు వేశారన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించకుండా అడ్డు పడుతున్నారని మండిపడ్డారు. భుజబలపట్నం ఎంపీటీసీని పోలీసులు నిర్బంధం నుంచి విడిపించి ఓటు హక్కును కల్పించాలని ఆయన కోరారు.


