
చింతలపూడి మండలం అల్లిపల్లి చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న అధికారులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: తెలంగాణ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బోర్డర్ చెక్‌పోస్టుల్లో హై అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న చెక్‌పోస్టులతో పాటు కొత్తగా 7 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి సరిహద్దు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. చింతలపూడి, పోలవరం సబ్ డివిజన్ల పరిధిలో సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టుల్లో ద్విచక్రవాహనాలు మొదలుకొని బస్సుల వరకు నిత్యం తనిఖీలతో ఆయా ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో పాటు భారీగా మద్యం, నాటుసారా నిల్వలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. ఏలూరు, ఖమ్మంజిల్లా పోలీస్ ఉన్నతాధికారులు, కలెక్టర్లు సమావేశమై ప్రత్యేక నిర్ణయాలు తీసుకుని ఎన్నికల కమిషన్ నియామవళికి అనుగుణంగా తనిఖీల ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఏలూరు జిల్లా పరిధిలోని చింతలపూడి, పోలవరం సబ్‌డివిజన్లల్లో అల్లిపల్లి, లింగగూడెం, మర్రిగూడెం, తాటికల్లుగూడెం, కొయ్యమల్లవరం, వేలూరు, కృష్ణపాలెంలో ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రతి చెక్‌పోస్టు వద్ద ఏఆర్ సిబ్బందికి విధులు కేటాయించి 24 గంటలూ తనిఖీలు కొనసాగేలా షిప్టులు ఏర్పాటు చేసి విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే చెక్‌పోస్టులు అప్రమత్తం చేసి ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నారు.
మద్యం సీజ్ : రేంజ్ పరిధిలో ఇప్పటి వరకు 132 కేసులు నమోదు చేసి 1185 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు. రేంజ్ పరిధిలో మొత్తం 10 చెక్‌పోస్టులున్నాయి. ఏలూరు జిల్లా పరిధిలో ఇప్పటి వరకు 12,800 లీటర్ల నాటుసారా, ఇతర రాష్ట్రాలకు చెందిన నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్ సీజ్ చేశారు. సరిహద్దులోని గ్రామాల్లో 129 చోట్ల కార్డన్ సెర్చ్‌లు నిర్వహించి అసాంఘిక శక్తులు, అనుమానాస్పద వ్యక్తులపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. అలాగే 232 మంది రౌడీషీటర్లు, సస్ప్కెట్ షీటర్లపై బైండోవర్ కేసులు నమోదు చేశారు.
తెలంగాణ ఎన్నికల నేపఽథ్యంలో కట్టుదిట్టం
కొత్తగా ఏలూరు, ఖమ్మం జిల్లాల మధ్య 7 చెక్‌పోస్టుల ఏర్పాటు
ఏఆర్ సిబ్బందితో ప్రత్యేక పర్యవేక్షణ
277 కేసుల మద్యం.. 12,800 లీటర్ల సారా సీజ్
రేంజ్ నుంచి 760 మంది సిబ్బంది
తెలంగాణ ఎన్నికలకు రాష్ట్రం నుంచి 5 వేల మంది సిబ్బందిని బందోబస్తుకు కేటాయించారు. దీనిలో ఏలూరు రేంజ్ పరిధిలోని ఆరు జిల్లాల నుంచి 760 మంది సిబ్బందికి విధులు కేటాయించాం. 460 మంది హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, 300 మంది హోంగార్డులు తెలంగాణ ఎన్నికల పోలింగ్ సమయంలో బందోబస్తు విధుల్లో ఉంటారు. ఇప్పటికే అందరికీ ఎలక్షన్ డ్యూటీ ఆర్డర్లు పంపాం. నవంబర్ 30న పోలింగ్ జరగనున్న నేపధ్యంలో మూడు రోజుల ముందే సిబ్బంది విధుల్లోకి వెళ్తారు.
– జీవీవీ అశోక్ కుమార్, డీఐజీ
