
స్పందనలో మహిళల అర్జీని పరిశీలిస్తున్న ఎస్పీ రవిప్రకాష్
ఎస్పీ రవిప్రకాష్
భీమవరం : స్పందనలో వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ చేసి ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ యు.రవిప్రకాష్ అధికారులను ఆదేశించారు. భీమవరం డీఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులతో ఎస్పీ మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 21 మంది బాధితులు అర్జీలు అందజేశారన్నారు. ఫిర్యాదుల్లో ఎక్కువగా వరకట్న వేధింపులు, సరిహద్దుల గొడవలు, సివిల్ తగాదాలకు సంబంధించినవి ఉన్నాయన్నారు. అనంతరం ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని, సంబంధిత పోలీసు అధికారులను ఫోన్‌లో ఆదేశించారు. స్పందనలో ఎస్పీతోపాటు ఏఎస్పీ ఏవీ సుబ్బరాజు పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు.
శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు
ఏలూరు (టూటౌన్): శబరిమలకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 22 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సీహెచ్ రాకేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో ఒక రైలు నరసాపురం–కొట్టాయం మధ్య కాగా, రెండోది కాకినాడ టౌన్–కొట్టాయం మధ్య నడుపుతారు. 07119 నంబర్‌తో నర్సాపురం నుంచి కొట్టాయం వరకు ఈ నెల 26న, వచ్చే నెల 3వ తేదీలలో నడుస్తుంది. 07120 నంబర్‌తో కొట్టాయం నుంచి నరసాపురానికి ఈ నెల 27, డిసెంబరు 4వ తేదీలలో తిరుగు ప్రయాణమవుతుంది. అలాగే 07125 నంబర్‌తో కాకినాడ టౌన్ నుంచి కొట్టాయంకు ఈ నెల 23, 30 తేదీలలో నడుపుతారు. 07126 నంబర్‌తో కొట్టాయం నుంచి నరసాపురానికి ఈ నెల 25, డిసెంబరు 2 తేదీలలో తిరుగు ప్రయాణమవుతుంది.
ఉరి వేసుకుని శిల్పి ఆత్మహత్య
జంగారెడ్డిగూడెం: పట్టణంలోని రాజీవ్‌నగర్‌లో ఓ శిల్పి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్రి వెంకటరమణ (34) శిల్పి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సోమవారం రాజీవ్‌నగర్‌లోని తన రేకుల షెడ్డు ఇంట్లో ఇనుప గొట్టానికి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకటరమణకు భార్య, 10 ఏళ్ల కుమారుడు ఉన్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.