కళ్లకు గంతలు కట్టుకుని దీక్షలు
నూజివీడు: 8 ఏళ్లుగా జీతాలను పెంచడంలో ఆర్జీ యూకేటీ ఉన్నతాధికారులు చేస్తున్న జాప్యానికి నిరసనగా నూజివీడు ట్రిపుల్‌ఐటీలోని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేస్తున్న ధర్మపోరాట దీక్ష ఆదివారం కొనసాగింది. 12వ రోజు వీరంతా కళ్లకు గంతలు కట్టుకుని దీక్ష చేపట్టారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ క్యాంపస్‌లో ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో వైస్ చాన్సలర్ ఆచార్య ఎం.విజయకుమార్ దీక్షా శిబిరం వద్దకు రాగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం తమ సమస్యపై నివేదికను ఇవ్వమని అడిగినా మూడు నెలలుగా ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని నిలదీశారు. జీతాల పెంపుపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని, దీక్షను విరమించాలని వైస్ చాన్సలర్ కోరారు. వేతనాల పెంపుపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసు కునే వరకూ ఆందోళనను విరమించేది లేదని అసిస్టెంట్ ప్రొఫెసర్లు తేల్చిచెప్పారు. ఏదో ఒక హామీతో రాకుండా చాన్సలర్‌తో చర్చిస్తానని చెప్పడం తమను మభ్యపెట్టడమే అవుతుందని, ఇలాంటి దాటవేత ధోరణితోనే తమకు అన్యాయం చేస్తున్నారని వారు వాపోయారు. అనంతరం విలేకరులు అడుగుతున్నా మాట్లాడకుండా వీసీ విజయకుమార్ క్యాంపస్ నుంచి వెళ్లిపోయారు. దీక్షల్లో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు పీవీ లక్ష్మణరావు, బొత్స శ్రీనివాసరావు, లంకపల్లి రాజేష్, వెంకటేశ్వర్లు, సామినేని భవాని, రచనా గోస్వామి, యూ విజయశ్రీ, దీప్తి సాహూ పాల్గొన్నారు.


