మా భూముల కోసం ప్రాణాలైనా అర్పిస్తాం
ఏలూరు (టూటౌన్): మా ప్రాణాలైనా అర్పిస్తాం.. కానీ మా భూములను మాత్రం నావీ ఆయుధ కర్మాగారానికి ఇచ్చేది లేదంటూ కొయ్యలగూడెం మండలం బోడిగూడెం, బర్కెట్ నగరం, మంగపతిదేవిపేట, ఊట్లగూడెం, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం రేగులగుంట గ్రామాలకు చెందిన రైతులు సోమవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ కొయ్యలగూడెం మండలం బోడిగూడెం పంచాయతీ పరిధిలోని బర్కెట్‌నగరం ప్రాంతంలోని 1,166 ఎకరాల్లో నావీ ఆయుధ కర్మాగారం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేయడం దారుణమన్నారు. దీని వల్ల ఐదు గ్రామాలకు చెందిన చిన్న, సన్నకారు రైతులు రోడ్డు పాలవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తామంతా జీవనోపాఽధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. కనీసం రైతుల అనుమతి తీసుకోకుండా, గ్రామసభలు నిర్వహించకుండా భూములను బలవంతంగా లాక్కోవాలని చూడటం దుర్మార్గమన్నారు. భూములను ఇచ్చేందుకు తామెవరికీ ఇష్టం లేదని స్పష్టం చేశారు. రైతుల అభ్యంతరాలను ప్రభుత్వానికి నివేదించాలని కలెక్టర్‌ను కోరారు. తమకు న్యాయం చేయకపోతే ఎంతటి పోరాటానికై నా సిద్ధమన్నారు.


