జగన్ కటౌట్ చూసి కూటమికి కంగారు
● అందుకే అక్రమ అరెస్ట్‌లు
● మాజీ మంత్రి వనిత మండిపాటు
ద్వారకాతిరుమల: కూటమి నాయకులు మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కటౌట్‌ను చూసి.. కంగారు పడే పరిస్థితికి వచ్చారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్‌చార్జి తానేటి వనిత ఎద్దేవా చేశారు. గత నెల 21న జగన్ జన్మదిన వేడుకల్లో భాగంగా రామసింగవరంలో వివాదాస్పద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారంటూ గ్రామానికి చెందిన యువకులు మానుకొండ హిమకుమార్, మానుకొండ రాజ్‌కుమార్, బిరుదుగడ్డ రాజు, కనికెల్లి కిషోర్, కనికెల్లి ఏసులపై ద్వారకాతిరుమల పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం వారిని బెయిల్‌పై విడుదల చేశారు. ఈ సందర్భంగా వనిత ఆదివారం బాధిత యువకుల ఇళ్లకు వెళ్లి వారికి, వారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. తానున్నానని భరోసా ఇచ్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ జగనన్న పుట్టినరోజు వేడుకలు రాష్ట్రమంతటా జరిగిన విధంగానే గోపాలపురం నియోజకవర్గంలో అట్టహాసంగా జరిగాయన్నారు. వీటిని చూసి కూటమి ప్రభుత్వంలో వణుకు మొదలైందన్నారు. దీంతో కటౌట్‌లలో ఏ తప్పులున్నాయని వెతుక్కునే పరిస్థితికి కూటమి నేతలు దిగజారిపోయారని మండిపడ్డారు. ఒక సినిమా డైలాగ్‌ను వాడిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు.
డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమే..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రజలకు ఏవైతే హామీలిచ్చారో వాటిలో ఏ ఒక్కటీ చంద్రబాబు నెరవేర్చలేదని తానేటి వనిత చెప్పారు. దీంతో ప్రజలంతా వారిని తిరస్కరిస్తున్నారన్నారు. దా నిని కవర్ చేసుకోవడానికి ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి కాబట్టి, జగనన్న పుట్టినరోజును కూ డా రాజకీయానికి వాడుకున్నారని విమర్శించారు. ఈ దుస్థితి మన రాష్ట్రంలో, మన రాజకీయాల్లో మాత్రమే కనిపించడం దౌర్భాగ్యమన్నారు. మేకను నరికిన దానికి జంతు బలి అంటూ రచ్చ చేయడం దారుణమన్నారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్, బాలకృష్ణ కోసం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు బలిచ్చినవి వారికి కనిపించలేదా అని ప్రశ్నించారు. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, ఎప్పుడో పెట్టిన పోస్టులను వెతికి పట్టుకుని మరీ వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన పరిస్థితి మన రాష్ట్రంలో మాత్రమే చూశామన్నారు. వైఎస్సార్‌సీపీని అణగదొక్కడమే లక్ష్యంగా కూటమి పాలన సాగిస్తోందని మండిపడ్డారు. అందుకే ప్రజ లు కూటమి ప్రభుత్వాన్ని చీదరించుకుంటున్నారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని వనిత భరోసా ఇచ్చారు. ఆమె వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.


