తెల్ల రేషన్ కార్డుల ప్రాతిపదికన అరకొరగా ఇస్తూ వచ్చిన సంక్షేమ పథకాలు సైతం అనర్హులకు పోతున్నాయని పదిహేనేళ్ల క్రితంవరకూ పాలకులు అనుమానించేవారు. ఈ నేపథ్యంలోనే ఆధార్ రంగ ప్రవేశం చేసింది. ఇప్పుడు దానిపై కూడా శంకలు మొదలై నట్టున్నాయి. ఇకపై ఓటర్ గుర్తింపు కార్డున్నవారికే సంక్షేమ పథకాలివ్వాలని యోచిస్తున్నామంటూ కేంద్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ శుక్రవారం బాంబు పేల్చారు.
దేశంలో నిరుడు నవంబర్ నుంచీ వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం (ఈసీ) ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరిట అమలుచేస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ ఎన్ని అవకతవకలతో నిండివుంటున్నదో, దానివల్ల జనం ఎన్ని కడగండ్లు అనుభవిస్తున్నారో ఆయనకు తెలియదనుకోవాలా? ఇంతకూ ఆధార్ ఎందుకు పనికి రాదనుకుంటున్నారు? ఏ కేంద్రానికెళ్లినా అయిదు నిమిషాల్లో ఆధార్ సంపాదించ వచ్చన్నది కేంద్రమంత్రి వాదన. పరిస్థితి ఇలావుంటే దాన్ని సరిచేయాల్సింది ప్రభుత్వమే. అంతేతప్ప దాన్ని గుర్తించబోమనటం సరికాదు.
ఏ కేంద్రానికెళ్లినా ఫలానా పత్రం ఉంటే తప్ప ఆధార్ ఇవ్వబోమని చెప్పడం నిత్యం అందరికీ కనబడుతూనే ఉంటుంది. ఇలా వాటి చుట్టూ పడిగాపులు పడుతున్నవారు సామాన్యులు. కానీ కొన్నేళ్లక్రితం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనడానికొచ్చిన ‘పెద్ద మనుషులు’ ఒక్కొక్కరిదగ్గరా వేర్వేరు పేర్లతో పలు ఆధార్ కార్డులుండటం తెలంగాణలో చానెళ్ల సాక్షిగా బయటికొచ్చింది. అడపాదడపా బంగ్లాదేశీయులో, మరొకరో ఆధార్ సంపాదిస్తున్న వైనాలూ బయటపడుతున్నాయి. నిజమే. ఈ నేరాన్ని నిరోధించటానికి బదులు మొత్తానికే ఆధార్ పక్కనబెట్టడం
సరైందేనా?
అసలు ఆధార్ కార్డుపై అయోమయం ఈనాటిది కాదు. మహారాష్ట్రలోని తెంబ్లీలో 2010లో ఆ పథకాన్ని స్వయంగా ప్రారంభించిన అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కే దానిపై మూడునాలుగేళ్లు గడిచాక కూడా స్పష్టత లేదు. సంక్షేమ పథకాలు అందాలన్నా, బ్యాంకు ఖాతాలు ప్రారంభించాలన్నా... ఇతరేతర అంశాల్లో గుర్తింపు కావాల్సిన సంద ర్భాలొచ్చినా అది పనికొస్తుందని మొదట్లో చెప్పిన ఆయన... మరికొన్నాళ్లకు ఆ కార్డు తీసుకోవటం ఐచ్ఛికమేనని, ఉండితీరాలని ఎవరినీ పట్టుబట్టబోమని స్వరం మార్చారు. ఇన్నాళ్లు గడిచినా ఇంకా గందరగోళం ఆశ్చర్యకరం.
ఆ సంగతలావుంచి ఓటర్ గుర్తింపు కార్డు మాత్రం ‘సచ్ఛీలమైనద’ని ఎలా చెప్పగలుగుతారు? సర్ పూర్తయినచోట అర్హులైన లక్షలమంది తమ పేర్లు అన్యాయంగా తొలగించారని మొరబెట్టుకుంటున్నారు.
బెంగాల్‌లో అయితే జనం ట్రిబ్యునళ్ల చుట్టూ తిరుగుతూ అవస్థలు పడుతున్నారు. మరోపక్క ఒకే ఇంటి చిరునామాతో వందలాదిమంది ఓటర్లున్న ఉదంతాలూ, జంతు వుల పేరిట గుర్తింపు కార్డులు తయారైన ఉదంతాలూ పలుచోట్ల బయటపడ్డాయి. వాస్తవం ఇదికాగా ఓటర్ కార్డుకు కేంద్ర మంత్రి మరీ అంతగా భుజకీర్తులు తగిలించటం తొందరపాటు.
అసలు పౌరసత్వాన్ని తేల్చటానికి ప్రత్యేక చట్టాలు, ప్రత్యేక వ్యవస్థలూ ఉండగా... ఈసీ గుర్తింపు కార్డు ఆధారంగా పౌరులో కాదో నిర్ధారించుకుని, ఆ ప్రాతిపదికనే సంక్షేమం ఇస్తామనటం ఎలా చూసినా సరికాదు. ఓటర్ల జాబితాల ఉద్దేశం ఎన్నికలు నిర్వహించేందుకు మాత్రమే. ఒక ప్రయోజనం కోసం ఉద్దేశించినదాన్ని మరొకందుకు వినియోగించటం చట్టవిరుద్ధమని బెంగాల్ సర్కారు తీరుపై దాఖలైన పిటిషన్లను విచారిస్తూ ఆర్నెల్ల క్రితం సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. అయినా ఈ విషయంలో ముందుకెళ్లాలనుకోవటం అన్యాయం.
బయోమెట్రిక్‌ను సర్వరోగ నివారిణిగా చూడటమైనా సమస్యే. సీనియర్ సిటిజన్‌ల బయోమెట్రిక్ నిర్ధారణ ఎంత సమస్యాత్మకంగా ఉంటున్నదో ఎవరికీ తెలియనిది కాదు. అలాంటివారికి రేషన్ మొదలుకొని పెన్షన్లవరకూ ఏదీ దక్కనీయరాదని నిర్ణయించటంలోని హేతుబద్ధత ప్రశ్నార్థకం. సంక్షేమానికయ్యే నిధుల్ని కత్తిరించాలనుకుంటే వేరేసంగతి.
ఇప్పటికే పదమూడున్నర కోట్లమందికి ఓటు పోయింది. సర్ ప్రక్రియ సాగు తున్న వేరేచోట్ల మరింతమంది వీరికి తోడవుతారు. ఇలాంటివారంతా అనివార్యంగా ఉద్యమ కారులవైపు చూస్తారు. నక్సలిజాన్ని అంతమొందించామంటున్న కేంద్రం అలాంటి మరో సమస్యకు బీజం పడే నిర్ణయం తీసుకోబోదని ఆశించాలి.


