యాగాశ్వం సిద్ధం!

Vardhelli Murali Article on Trs Chief Kcr Plans on National Politics - Sakshi

జనతంత్రం

బాహుబలి, కేజీఎఫ్, పుష్ప, ట్రిపులార్‌... ఇప్పుడు కేసీఆర్‌! ఉత్తరాదిపై దక్షిణాది దండయాత్ర ఇది. పాన్‌ ఇండియా సౌత్‌ సినిమాలు ఉత్తరాదిని ఉర్రూతలూగించి బాక్సాఫీసుల్ని బద్దలు కొట్టాయి. రాజకీయం వంతొచ్చినట్టుంది. కేసీఆర్‌ ఆయుధపూజ మొదలు పెట్టారు. అశ్వమేధ యాగానికి రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌లో ఇటువంటి ఒక రాజకీయ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్టు కేసీఆర్‌ స్వయంగా ప్రకటించారు. ఇక తారీఖులు చెప్పడమే తరువాయి!

యాగం ముగిసిన తర్వాత యాగాశ్వాన్ని ఈశాన్య దిశగా పంపించి జైత్రయాత్ర మొదలుపెట్టడం రివాజట! తెలంగాణకు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బిహార్‌ తదితర రాష్ట్రాలు ఈశాన్య దిక్కున ఉంటాయి. సంకల్పం పెట్టుకోగానే జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హైదరాబాద్‌లో కేసీఆర్‌ను కలుసుకోవడం యాదృచ్ఛికమైనా, శకునం కుదిరిందని కూడా భావించవచ్చు. గడచిన కొంత కాలంగా రాష్ట్ర రాష్ట్రాలూ తిరిగి ఒక జవనాశ్వాన్నయితే వెతికి పట్టుకొచ్చారు. దాన్ని యాగాశ్వంగా సిద్ధం చేశారు. ఆ గుర్రం పేరు – ఎజెండా. ఫ్రంట్లూ, టెంట్లతో పనికాదనీ, ప్రజలకు సమ్మతమయ్యే ఒక ఎజెండాను వారి ముందుంచి అటు నుంచి నరుక్కు రావాలనీ కేసీఆర్‌ నిర్ణయించుకున్నారు.

ఫ్రంట్లూ, టెంట్ల కోసం కూడా ఆయన కొంతకాలం ప్రయత్నించారు. అది కుదిరేపని కాదని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి కూడా కేసీఆర్‌ సిద్ధపడి రాయబారాలు పంపించారని ఇటీవల ఆ పార్టీ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. అయితే తమ అ«ధిష్ఠానం ఇందుకు అంగీకరించలేదని కూడా వివరించారు. కాంగ్రెస్‌ పార్టీ భవిష్యత్తు వ్యూహాలకు సంబంధించి ముగ్గురు సభ్యులున్న అధిష్ఠాన కుటుంబం వన్‌ బై టూ గా చీలి పోయిందని వినికిడి. తెలంగాణలో ‘అకేలా ఛలో’ అనేదే రాహుల్‌ వైఖరట! ప్రస్తుతానికైతే ఆయన మాటే చెల్లుబాటవు తున్నది.

ఈ నేపథ్యంలో ఫ్రంట్లూ, టెంట్లకు గుడ్‌ బై చెబుతూ ఒక ఎజెండా ఆధారంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్టు కేసీఆర్‌ సంకేతాలిస్తున్నారు. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ, యాంటీ ఫెడరల్, పెట్టుబడిదారీ అనుకూల ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తున్నవాళ్లు దేశంలో చాలామంది ఉన్నారు. అనేక పార్టీలు, సంస్థలు కూడా ఉన్నాయి. అందులో కేసీఆర్‌ కూడా ఉన్నారు. ఆయన వ్యతిరేకతకు ఇవీ కారణాలే కావచ్చు. వేరే కారణాలు కూడా ఉండవచ్చు. ఆ వ్యతిరేకత కూడా ముందు నుంచీ ఒకే స్థాయిలో లేదు. క్రమంగా పెరుగుతూ వస్తున్నది. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ తొలి ఇన్నింగ్స్‌ సమయంలో ప్రధానిగా నరేంద్ర మోదీయే ఉన్నారు. కానీ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ప్రదర్శిస్తున్నంత వ్యతిరేకతను అప్పుడా యన ప్రదర్శించలేదు. 

భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా నిలబడగల స్థితిలో మరో జాతీయ పార్టీ కాంగ్రెస్‌ ఇప్పుడు లేదు. చిక్కి శల్యావ శిష్టమైన స్థితికి అది చేరుకున్నది. ఆ పార్టీ నాయకత్వ సామర్థ్యంపై పలువురికి నమ్మకం లేదు. అయినప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికీ పలు రాష్ట్రాల్లో ఉనికిలో ఉన్నది. కనుక ఆ పార్టీతో కలిసే ఎన్నికల్లో పని చేయాలనే అభిప్రాయం బీజేపీ వ్యతిరేకుల్లో ఎక్కువమంది వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్, కేజ్రీవాల్, మమతా బెనర్జీలవి భిన్నదారులు. ఎవరికి వారే ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ఎవరి దారిలో వారు సన్నాహాలు చేసుకుంటు న్నారు. ముగ్గురిలోనూ కేసీఆర్‌ ఆలోచిస్తున్న తీరు సంప్రదాయ ఒరవడికి భిన్నంగా, కొంత నూతనంగా కనిపిస్తున్నది.

సకల వనరులున్న దేశంలో పేదరికం ఎట్లున్నది? అనే సింగిల్‌ లైన్‌ స్టోరీకి స్క్రీన్‌ప్లే రాసుకొని ఒక సరికొత్త ఎజెండాను ఆయన దేశం ముందుకు తేవడానికి సిద్ధమైనట్టు కనిపిస్తున్నది. కలిసి వచ్చేవాళ్లు వస్తారు. లేదంటే ఆయనే అన్యాపదేశంగా చెప్పినట్టు ‘భారత రాష్ట్ర సమితి’ ఉండనే ఉన్నది. అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్‌ ‘భారతదేశం పార్టీ’ గురించి ఆలోచించే వారు. 1989 ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన ఆలోచన అట కెక్కింది. ‘నేషనల్‌ ఫ్రంట్‌’ ఛైర్మన్‌ హోదాతో ఆయన సరిపెట్టు కున్నారు. మళ్లీ ఇన్నేళ్లకు ఒక తెలుగువాడి జాతీయ కాంక్ష తెర ముందుకు వచ్చింది.

కేంద్రంలో అధికారంలోకి రావాలంటే టార్గెట్‌ 272 లోక్‌సభ స్థానాలు. తెలంగాణాలో ఉన్నవే 17. అందులో ఒక సీటు ఒవైసీ కుటుంబం చేతిలో ఉన్నది. ఎంత అనుకూల వాతావరణాన్ని సృష్టించుకోగలిగినా ఒక డజన్‌కు అటూ ఇటుగానే గెలిచే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్‌ కాకుండా ఇరవై సీట్లకు మించి గెలవగలిగిన ప్రాంతీయ నాయకులు కూడా దేశంలో ఉన్నారు. మమతా బెనర్జీ, స్టాలిన్, జగన్‌మోహన్‌ రెడ్డి కచ్చితంగా ఈ నెంబర్‌ దాటే అవకాశం ఉంటుంది. ఒకవేళ మోదీ ప్రభంజనం లేకపోతే అఖిలేశ్, తేజస్వీ ‘యాదవ’ సోదరులు కూడా ఇరవైని దాటగలరు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనే కనిపించిన ‘మోదీ వేవ్‌’ లోక్‌సభ ఎన్నికల్లో ఉండదని చెప్పడం కష్టం. ఈ నాయకుల్లో మమతా బెనర్జీని మినహాయిస్తే మిగిలిన వారెవ్వరికీ రాష్ట్రాన్ని వదిలేసి ఢిల్లీ రాజకీయాలకు వెళ్లాలనే ఆసక్తి ఉండకపోవచ్చు. కేజ్రీవాల్‌ పార్టీ అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లోనూ క్లీన్‌ స్వీప్‌ చేయగలిగితే సరిగ్గా ఇరవై సీట్లవుతాయి. కానీ ఢిల్లీ ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవైపు, లోకసభ ఎన్నికల్లో మరోవైపు ఏకపక్షంగా మొగ్గడం ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో ఇది సాధ్యం కాకపోవచ్చు. ఒడిషాలో కూడా లోక్‌సభ ఎన్నికలు వచ్చేసరికి నవీన్‌ పట్నాయక్‌ మ్యాజిక్‌ అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా వర్కవుట్‌ కావడం లేదు.
 
చేతిలో పది పదిహేను సీట్లు మాత్రమే పెట్టుకుని కేసీఆర్‌ జాతీయ ప్రత్యామ్నాయం గురించి ఎందుకు ఆలోచిస్తున్నట్టు? ఈ ఆలోచన ఒక రెండంచుల ఖడ్గ వ్యూహంలా కనిపిస్తున్నది. మొదటి లక్ష్యం – తెలంగాణలో హ్యాట్రిక్‌ కొట్టాలి. ఇప్పటికే రెండుసార్లు అధికారంలో ఉన్నందువల్ల సహజంగానే కొంత ప్రజా వ్యతిరేకత ఏర్పడుతుంది. దీనిని అధిగమించి గెలవగలిగే ఒక వాతావరణాన్ని సృష్టించగలగాలి. పాత కథలు పక్కన పెట్టి తాజా కథనాలను వినిపించాలి. కొత్త నరేటివ్‌ కావాలి. కొత్త ఆలోచన జొప్పించాలి. కొత్త పదజాలం వాడాలి. బెంగాల్‌లో మమతా బెనర్జీ హ్యాట్రిక్‌ కొట్టడానికి సంవత్సరం ముందు వరకూ రాష్ట్రంలో ఆమెకు వ్యతిరేక వాతావరణమే కనిపించింది. కానీ ఆమె వ్యూహాత్మక పోరాటం దాన్ని అధిగమించగలిగింది. ఇదే వ్యూహాన్ని కేసీఆర్‌ ఇప్పటికే అమలుచేయడం ప్రారంభించి నట్టు కనిపిస్తున్నది.

ఇప్పటికిప్పుడయితే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌లో కొంత కదలిక కనిపిస్తున్నది. వరంగల్‌లో జరగబోయే రాహుల్‌ గాంధీ సభ తర్వాత కాంగ్రెస్‌ బలంపై ఒక అంచనాకు రావచ్చు. రాష్ట్రంలో గ్రామగ్రామాన విస్తరించిన పార్టీ కాబట్టి ఓ రెండు మూడు లక్షల మందిని సమీకరించడం వారికి పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ వచ్చే జనం మూడ్‌ ముఖ్యం. పసిఫిక్‌ మహా సముద్రంలా ప్రశాంతంగా కూర్చుండిపోయారంటే బలవం తంగా వచ్చిన బాపతు కింద లెక్క. సునామీలను ఎగజిమ్మే హిందూ మహాసముద్రంలా కనిపిస్తే మాత్రం కాంగ్రెస్‌ సవాల్‌ను గుర్తించక తప్పదు. ఇంకో రెండు మూడు నెలల్లో తమ అసలైన కార్యాచరణ ప్రారంభమవుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. కార్యాచరణ అంటే పెద్ద ఎత్తున కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి లాగేసుకోవడమన్నమాట! తద్వారా టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేననే అభిప్రా యాన్ని వ్యాప్తి చేయాలని బీజేపీ ఆలోచిస్తున్నది. 

కేసీఆర్‌ కూడా తమ పోరాటాన్ని కాంగ్రెస్‌ మీద కాకుండా బీజేపీ మీదనే కేంద్రీకరించారు. ఉద్యమకాలంలో వెదజల్లి్లన పదజల్లులు సెంటిమెంట్‌ రగిలించడానికీ, మొదటి ఎన్నికల్లో గెలవడానికీ ఉపకరించాయి. రెండో ఎన్నికలకు ‘బంగారు తెలంగాణ’ భాషను వాడేశారు. ‘బంగారు తెలంగాణ’ ఇప్పటికే ప్రజల అనుభవంలోకి వచ్చినందువల్ల ఇంకోసారి ఉపయోగపడే అవకాశం లేదు. ఇప్పడు దేశవ్యాప్తంగా మైనారిటీలనూ, వామపక్ష, మధ్యేవాద లౌకిక బుద్ధిజీవులనూ బీజేపీ వ్యతిరేక పదజాలం, భావజాలం ఉత్తేజ పరుస్తున్నది. తెలంగాణలోనూ ఇటువంటి వారి సంఖ్య గణనీయంగానే ఉన్నది. పదజాలాన్ని సృష్టించడంలోనూ, కమ్యూనికేట్‌ చేయడంలోనూ కేసీఆర్‌ శక్తి సామర్థ్యాలు తెలిసినవే. బీజేపీ వ్యతిరేక ఛాంపియన్‌గా కాంగ్రెస్‌ కంటే మిన్నగా తానే కనిపిస్తే, ఇటీవలి కాలంగా దూరమవు తున్న ఈ సెక్షన్ల ఓట్లు మళ్లీ తన ఖాతాలో పడవచ్చని టీఆర్‌ఎస్‌ భావిస్తుండవచ్చు. ఫలితంగా మూడోసారి గెలవడం, కేసీఆర్‌ వారసుడిగా కేటీఆర్‌ను గద్దెనెక్కించడం జరిగితే తొలి లక్ష్యం పూర్తయినట్టే!

ఇక రెండో లక్ష్యం – కేసీఆర్‌ను జాతీయ స్థాయిలో ఫోకస్‌ చేయడం! బీజేపీ విధానాలకూ, పాలనకూ వ్యతిరేకంగా ప్రచారం చేయడంతోపాటు, తెలంగాణ అభివృద్ధి మోడల్‌ను దేశవ్యాప్తంగా చాటింపు వేయడం, ఒక కొత్త ఎజెండాను పరిచయం చేయడం ద్వారా, ఉత్తరాది వారికి కేసీఆర్‌ను చేరువ చేయొచ్చని ఆలోచిస్తున్నట్టు కనబడుతున్నది. 2014 ఎన్నికలకు ముందు రెండేళ్ల పాటు గుజరాత్‌ అభివృద్ధి మోడల్‌ను ఊదరగొట్టడం నరేంద్ర మోదీకి లాభించింది. అప్పుడక్కడ వున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఇప్పుడు కేసీఆర్‌ తరఫున పనిచేస్తున్నారు. వ్యూహాల ద్వారా ఎకాయెకిన ఢిల్లీ పగ్గా లను కేసీఆర్‌ చేపడతాడనే భ్రమలేమీ లేకపోయినా, జాతీయ స్థాయిలో ఒక ప్రముఖ నాయకుడిగా నిలబడి పోవచ్చు. కాలం కలసివస్తే చక్రధారి కూడా కావచ్చు. రైతు నాయకునిగా పేరున్న చరణ్‌సింగ్‌ ప్రధాని అయ్యారు. దళితనేత మాయావతి అతిపెద్ద రాష్ట్రానికి నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఉత్తరాదిన పెద్దసంఖ్యలో ఉన్న ఈ రెండు వర్గాలను ఆకర్షించే దళిత బంధు, రైతు బంధు అనే రెండు బాణాలను ఆయన అమ్ములపొదిలో పెట్టుకొని బయల్దేరుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీఆర్‌ఎస్‌ గెలిస్తే ఖాయంగా కేటీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారన్న అభిప్రాయం రాష్ట్రంలో ఇప్పటికే బలపడిపోయింది. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే అన్ని కీలక వ్యవహారాలనూ ఆయన చక్కబెడుతున్నారు. శుక్రవారం నాడు ‘క్రెడాయ్‌’ వాళ్లు నిర్వహించిన ఒక రియల్‌ ఎస్టేట్‌ కార్య క్రమంలో మాట్లాడుతూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించాయి. ఏపీని దృష్టిలో పెట్టుకుని అక్కడ రోడ్లు, కరెంటు పరిస్థితి దారుణంగా ఉన్నదని అక్కడి స్నేహితులు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. సాధార ణంగా పొరుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీలో, గట్టు పంచా యతీలో ఉంటాయి తప్ప వారి కార్యక్రమాలపై పాలనా తీరుపై విమర్శలు చేసుకోరు. అక్కడ అధికారంలో ఉన్న పార్టీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంగా కూడా వుంటే తప్ప! రెండు రాష్ట్రాల్లోని రెండు వేర్వేరు ప్రాతీయ పార్టీలు విధానాలపై గొడవలు పడిన దాఖలాలు లేవు. ఎవరి మెరిట్‌ వారిది. ఎవరి ప్రాధమ్యాలు వారివి. ఉదాహరణకు తెలంగాణలో ఇప్పుడు సామాజిక పెన్షన్లను నెల చివరిదాకా ఇవ్వడం లేదన్న విమర్శ ఉన్నది. ఏపీలో ఒకటో తేదీనాడే 90 శాతం మందికి వాళ్ల ఇంటి దగ్గరికి వెళ్లి మరీ ఇస్తున్నారు. ఏప్రిల్‌లో ఒక రెండు మండలాల్లో టెక్నికల్‌ కారణాల వల్ల 11వ తేదీ నాడు పెన్షన్లు ఇచ్చారు. దీనికే ఎల్లో మీడియా ఇల్లు పీకి పందిరేసింది. ఎల్లో బ్యాచ్‌ తన శక్తియుక్తు లన్నింటినీ ఏపీలో ధారపోస్తున్నందు వలన తెలంగాణలో యాక్టివ్‌గా లేదు. అదే పెద్ద ఊరట.

తన వ్యాఖ్యలు కలకలం సృష్టించడంతో అదేరోజు కేటీఆర్‌ వివరణ ఇచ్చారు. ఆ వ్యాఖ్య తన ప్రసంగంలో యథాలాపంగా దొర్లిందే తప్ప ఉద్దేశపూర్వకంగా అనలేదని ఆయన ట్వీట్‌ చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన ప్రచారం జరిగిపోయింది. కేటీఆర్‌ వాఖ్యలను సమర్థిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షం పండుగ చేసుకున్నంత హడావిడి చేసి జనంలో మరింత పలచ బారి పోయింది. రాబోయే ఎన్నికలపై జాతీయ స్థాయిలో జరుగు తున్న చర్చల్లో సర్వే సంస్థలు గానీ, రాజకీయ విశ్లేషకులు గానీ తెలుగుదేశం పార్టీ ప్రభావాన్ని అసలు లెక్కలోకే తీసుకోవడం లేదు. ఇది ఆ పార్టీ చేసుకున్న స్వయంకృతాప రాధం. కేటీఆర్‌ వ్యాఖ్యలు కేవలం యథాలాపం అయినా ఇప్పుడో కొత్త చిక్కు వచ్చి పడింది. తెలంగాణలో దెబ్బతిన్న రోడ్ల ఫొటోలు సామా జిక మాధ్యమాల్లో హోరెత్తుతున్నాయి. వాటి మీద దృష్టి పెట్టక తప్పని పరిస్థితి కేటీఆర్‌ది. ఏమైనా... తెలంగాణ గడ్డపై నుంచి ప్రారంభం కాబోతున్న అశ్వమేధ యాగానికి జయము జయము జయము!

వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top