Sakshi Editorial ఎల్లో కాంగ్రెస్‌ గేమ్స్‌!

Vardelli Murali Article On Congress And TDP - Sakshi

జనతంత్రం

‘‘సానిదాన్నయితే మాత్రం నీతి వుండొద్దా? మా పంతులు గార్ని పిలిచి తెగదెంపులు చేసుకునేంతదాకా పరాధీననే’’ అంటుంది మధురవాణి ‘కన్యాశుల్కం’ నాటకంలో. అప్పటి వరకు తన జోలికి రావద్దని రామప్పంతులుకు సుద్దులు చెబు తుంది. ఎప్పుడో నూట పాతికేళ్ళనాటి ఫ్యూడల్‌ సమాజంలో కూడా ఇటువంటి స్వచ్ఛంద కట్టుబాట్లు ఉండేవన్న మాట. ఏక కాలంలో... అదీ ఒకరికి తెలియకుండా మరొకరితో వ్యవహారం నడపడం పాడి కాదన్నది మధురవాణికి తెలిసిన నీతి.

మనదిప్పుడు గొప్పగా పరిణతి సాధించిన నాగరిక సమా జమని అనుకుంటున్నాము. సమాజాన్ని నడిపించే రాజకీయ వ్యవస్థ మరింత గొప్పగా నీతులతో, నియమాలతో, నిష్ఠలతో ఉండాలని ఆశిస్తుంటాము. కొన్ని రాజకీయ పార్టీలు, కొందరు నాయకులు మనల్ని ఈ విషయంలో అడుగడుగునా నిరాశ పరుస్తూనే ఉన్నారు. ఊర్ధ్వలోకాల్లో ఉన్న మధురవాణిని పిలి పించి వీళ్ళకి గట్టి ట్యూషన్‌ పీకించాలన్నంత కోపాన్ని పదే పదే తెప్పిస్తూనే ఉన్నారు. ఆ జాబితాలో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక రాజకీయ పార్టీ కూడా ఉన్నది. దాని నాయకుడు ఈ విషయంలో జాతీయస్థాయి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

తాజా తాజాగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎవరితో ఉన్నది? ఎవరో ఒకరితో కలిసి ఉండవలసిందేనా... ఒంటరిగా ఉండకూడదా?... ఉండవచ్చు. కానీ టీడీపీ అలా ఉండలేదు. అదే దాని ప్రత్యేకత. ప్రత్యక్షమో... పరోక్షమో ఏదో ఒక పొత్తు ఇతర పార్టీలతో లేకుండా, గోబెల్స్‌ మీడియా రక్షణ లేకుండా, ప్రజా స్వామ్య వ్యవస్థల్లోని వివిధ ఉపాంగాల్లో నిద్రిస్తున్నట్టు నటించే స్లీపర్‌ సెల్స్‌ సహకారం లేకుండా ఆ పార్టీ బతకలేదు.

ఇంతకూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎవరితో స్నేహంగా ఉన్నది? ఏ జాతీయ పార్టీతో సఖ్యతగా ఉన్నది? సమాధానం చెప్పమంటే సాధారణ పౌరుడు చటుక్కున చెప్పలేని పరిస్థితి. ఎన్నికలకు ముందు అది కాంగ్రెస్‌ పార్టీతో జాతీయ స్థాయిలో జట్టుకట్టింది. కాంగ్రెస్‌ కూటమికి చంద్రబాబు ఒక సేనాపతి లాగా వ్యవహరించారు. జాతీయ స్థాయిలో తిరిగి ప్రచారం కూడా నిర్వహించారు. అంతకు ముందు జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి నిధులు సమకూర్చారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విభజిత ఆంధ్రప్రదేశ్‌ను లూటీ చేసి ఆ సొమ్ములో కొంత రాజస్తాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ గెలుపు కోసం మళ్లించారని ప్రతిపక్షాలు గట్టిగా ఆరోపించాయి.

సాధారణ ఎన్నికల్లో బీజేపీ కూటమికి బ్రహ్మాండమైన మెజా రిటీ లభించిన వెంటనే తన కాంగ్రెస్‌ మైత్రిని చంద్రబాబు మంచం కిందికి నెట్టారు. నరేంద్ర మోదీపైనా, బీజేపీపైనా అపారమైన ప్రేమను బహిరంగంగా ఒలకపోశారు. ఆంతరంగి కులైన తన ఎంపీలను అత్తవారింటికి పంపించినంత భద్రంగా బీజేపీలోకి చేర్చారు. కనుసైగ చేస్తే చాలు, పార్టీ మొత్తం బీజేపీ ఒడిలో వాలేందుకు సిద్ధమన్న సంకేతాలు పంపించారు. బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీలు చంద్రబాబు తరఫున ఆ పార్టీ ముఖ్యనేతలతో లాబీయింగ్‌ నడిపారు. వాజ్‌పేయి హయాం లోనూ, మోదీ తొలి ఇన్నింగ్స్‌ సందర్భంగానూ ఏర్పడిన సంబం ధాలను ఉపయోగించుకొని రాయ‘బేరాలు’ నడిపారు.

చంద్ర బాబు తన పంచమాంగదళ బృందాన్ని మొత్తం ఢిల్లీ లాబీ యింగ్‌లకు తోడుగా మోహరించారని చెబుతారు. ఎందుకంటే విభజిత రాష్ట్రంలో అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఫాదర్‌ అండ్‌ సన్స్‌ పాల్పడిన అవినీతిని ‘మదర్‌ ఆఫ్‌ ఆల్‌ కరప్షన్స్‌’గా నిపు ణులు పరిగణిస్తున్నారు. ఈ అంశాలపై కేంద్రం దృష్టిసారిస్తే తమ రాజకీయ భవిష్యత్తుకు ఇక మంగళం పాడినట్టేనని వారికి స్పష్టంగా తెలుసు. లాబీయింగ్‌ల ఫలితంగా ఇప్పటి వరకు అటు వంటి పరిస్థితి రాకుండా నెట్టుకొని రాగలిగారు. కానీ, బీజేపీ కూటమిలో చేరే ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు.

ఒక పక్క బీజేపీతో పొత్తు కోసం విరహగీతాలు పాడుతున్న సమయంలోనే, మంచం కిందకు నెట్టిన కాంగ్రెస్‌ స్నేహాన్ని పున రుద్ధరించడం మొదలుపెట్టారు. మధురవాణికి ఉన్నపాటి నీతి మనకు లేదని రుజువు చేశారు. గడిచిన శీతాకాలంలోనే చంద్ర బాబు రాహుల్‌ను రహస్యంగా కలిసి వచ్చారన్న సమాచారం రాజకీయ వర్గాల్లో గుప్పుమంది. ఈ పర్యటనకు ఆయన ఒక ప్రైవేట్‌ విమానాన్ని ఉపయోగించారట. ఈ సమావేశంలో ఇద్దరి మధ్య ఒక అంగీకారం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్‌ వ్యవహారాల్లో చంద్రబాబు మాటే చెల్లుబాటు అవుతుంది. ఆయన అభీష్టం మేరకే తెలంగాణ కాంగ్రెస్‌ నాయకత్వ మార్పిడి జరిగిందనేది జగమెరిగిన విష యమే. ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి కూడా బాబు ఒక పేరును సూచించారట. విభజనకు ముందు రాష్ట్ర కాంగ్రెస్, ప్రభుత్వ వ్యవహారాల్లో చక్రం తిప్పిన వ్యక్తి ఆయన. ఈ మార్పునకు ఇంకొంచెం సమయం ఉందట. ఈలోగా తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాలను ‘చక్కదిద్దే’ పనుల్లో బాబు బిజీగా ఉన్నారని కాంగ్రెస్‌ నాయకులే చెబుతున్నారు.

గతంలో కాంగ్రెస్‌లో పనిచేసి ప్రస్తుతం బీజేపీలో క్రియా శీలంగా వ్యవహరిస్తున్న ఒక మహిళా నాయకురాలికి కూడా ఈ మధ్య బాబు ఫోన్‌ చేశారట. మళ్లీ కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని ఆహ్వానించారట. కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని చంద్రబాబు ఆహ్వా నించడం ఏమిటని ఆమె ఆశ్చర్యానికి లోనయ్యారట. గతంలో తన ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి, ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న ఒక సీనియర్‌ నేతకు చాలాకాలం తర్వాత బాబు ఫోన్‌ చేశారట. కుశల ప్రశ్నల అనంతరం తెలుగుదేశం మాజీలందరూ కలిసి కాంగ్రెస్‌ పార్టీని పటిష్ఠం చేయవలసిన ‘చారిత్రక’ అవసరాన్ని గురించి బోధించారట.

బీజేపీ కండువా కప్పుకున్న తన ఆంత రంగిక మంత్రులను కూడా బాబు రంగంలోకి దించినట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. వివా దాస్పద వ్యాపారాల ఎంపీగా పేరున్న బాబు ఆంతరంగికుడు ఒకరు ఈ మధ్యన ఒక తెలంగాణ బీజేపీ నాయకునికి ఫోన్‌ చేశారట. ఈ బీజేపీ నేత పూర్వాశ్రమంలో కాంగ్రెస్‌ ఎంపీ, పారి శ్రామికవేత్త. బీజేపీలో ఉన్న తనను కాంగ్రెస్‌లో చేరమని సలహా ఇవ్వడం పట్ల సదరు నేత కూడా ఆశ్చర్యపోయారట. బీజేపీలో ఉన్న మాజీ తెలుగుదేశం, కాంగ్రెస్‌ నాయకులను తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేర్చడం ‘మిషన్‌ తెలంగాణ కాంగ్రెస్‌’లో తొలిభాగం. టీఆర్‌ఎస్‌లో ఉన్న మాజీ తెలుగుదేశం, కాంగ్రెస్‌ నాయకుల్లో అసంతృప్తి నేతలను కాంగ్రెస్‌లోకి చేర్పించడం రెండోదశ. ఇప్పటికీ చంద్రబాబుతో టచ్‌లో ఉంటున్న టీఆర్‌ఎస్‌ తెలుగుదేశం నాయకులకు ఈ ఆప రేషన్‌పై పూర్తి క్లారిటీ ఉంది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరిన ‘బీటీ’ (బంగారు తెలంగాణ) బ్యాచ్‌ టార్గెట్‌గా కొంత కాలం తర్వాత ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’ను ప్రారంభించే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్న బీజేపీని పూర్తిగా నిర్వీర్యం చేయడం, కాంగ్రెస్‌కు మద్దతుగా ఇతర చిన్నా చితకా పార్టీలను సమీక రించడం ప్రస్తుతం ఎల్లో కాంగ్రెస్‌ రాజకీయ వ్యూహంగా కన బడుతున్నది. ఇప్పటికే మోదీ వ్యతిరేక పోరాటం పేరుతో లెఫ్ట్‌ పార్టీలను దరిచేర్చుకోవడం మొదలైంది.

మిగిలిన పార్టీలను, గ్రూపులను తమ దారిలోకి తెచ్చుకోవడానికి ఎల్లో మీడియా పెద్దలతో సహా సిండికేట్‌లోని వివిధ విభాగాలు ఓవర్‌ టైమ్‌ పని చేస్తున్నాయి. తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి టీఆర్‌ఎస్, బీజేపీ, ఎమ్‌ఐఎమ్‌ మినహా మిగిలిన ముఖ్య పార్టీలన్నిటినీ ఒక గూటికి చేర్చాలన్నది ఎల్లో కాంగ్రెస్‌ ఆశయంగా చెబుతున్నారు. ఇది ఏ మేరకు నెరవేరుతుందో కాలమే సమాధానం చెప్పాలి. తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాల పట్ల ఆ పార్టీ నాయక శ్రేణులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తాము వలస పాలనలో జీవిస్తున్నట్టుగా ఉన్నదని ఒక సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు వాపోయాడు.

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు సంబంధించినంత వరకు చంద్రబాబుది ఇంకొంతకాలం పాటు చుట్టపుచూపు వ్యవహా రంగానే ఉంటుందని సమాచారం. ఇప్పుడు అక్కడ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేతుల్లో వరస ఎన్నికల్లో టీడీపీ చావుదెబ్బతిని ఉన్నది. బహుశా దేశంలో ఏ ప్రధాన ప్రతిపక్షం ఎన్నడూ ఎరుగ నంతటి శృంగభంగం ఏపీలో టీడీపీకి ఎదురైంది. అభ్యర్థులను నిలబెట్టి బీఫామ్‌లు ఇచ్చి, ప్రచారం చేయించిన పిదప ఘోర పరాజయాన్ని పసిగట్టి, తాము ఎన్నికలను బహిష్కరించామని చంద్రబాబు బొంకవలసి వచ్చింది. పోనీ ఆ మాట మీద కూడా నిలకడలేదు. మూడు మండల పరిషత్తులను దక్కించుకోవడా నికి పార్టీ ఎంపీటీసీలకు విప్‌ను సైతం జారీ చేశారు.

ఇంతటి దయనీయ పరిస్థితిలోకి దిగజారిన కారణంగా కోలుకోవడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో చెప్పలేని స్థితిలో ఆ పార్టీ ఉన్నది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడి ఇంకో రెండు నెలల్లో సగం పదవీకాలం పూర్తవుతుంది. అంటే రాజకీయంగా ఉత్తరాయణ పుణ్యకాలం ముగిసి దక్షిణాయనం మొదలవుతుం దన్నమాట. ఇక మోదీ ప్రభుత్వం ఫోకస్‌ మొత్తం వచ్చే ఎన్ని కలపై ఉంటుందని బాబు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తన అవినీతిపై కేంద్రీకరించకపోవచ్చని ఆయన ఆశ. దీన్ని అవకా శంగా తీసుకొని కాంగ్రెస్‌ కూటమిలోకి బహిరంగంగా చేరిపోవ చ్చని ఆయన లెక్కలు వేసుకుంటున్నారు.

సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వచ్చి, కేంద్రంలో కాంగ్రెస్‌ కూటమి బలపడి, ఎన్నికల్లో మెజారిటీ సీట్లు తెచ్చుకోగలిగితే తనకు కొంత ఉపశమనం లభిస్తుందని ఆయన ఆలోచిస్తున్నారు. కనుక వచ్చే ఐదారు మాసాల్లో ఆయన కాంగ్రెస్‌కు బహిరంగంగా మద్దతు ఇవ్వవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్‌ల వ్యూహాలు– జమా ఖర్చులూ అన్నీ బాబు బాధ్యతే ఇక! ఇక్కడ మోదీ వ్యతిరేక, కేసీఆర్‌ వ్యతిరేక కూటమిని స్ధిరపరిచిన తర్వాతనే, మొత్తం కూటమి అండదండలతో ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రవేశించాలని ఆయన చూస్తున్నట్టు అర్థమవుతున్నది. జనసేన, సీపీఐలతో ఆయనకు ఇప్పటికే సఖ్యత ఉన్నది. సీపీఎం కొంత వ్యతిరేకత కనబరుస్తున్నది. ‘మోదీ వ్యతిరేక ఫ్రంట్‌’ సాకుతో ఆ పార్టీని కూడా కూటమిలోకి చేర్చవచ్చని బాబు భావిస్తుండవచ్చు. అయితే, ఎన్ని పార్టీలతో కూటమి కట్టినా 24 శాతం ఓట్ల నుండి 50 శాతం ఓట్లకు ఎగబాకి గెలుపును అందు కోవడం సాధ్యం కాదన్న సంగతి అర్థం కానంత అపరిపక్వత చంద్రబాబుకు లేదు.

‘ఓదార్పు యాత్ర’ కొనసాగించడం కోసం కాంగ్రెస్‌ పార్టీకి  రాజీనామా చేసి, వైఎస్‌ జగన్, విజయమ్మలు స్వతంత్రంగా బరి లోకి దిగినప్పుడే భవిష్యత్తు పరిణామాలను చంద్రబాబు కొంత మేరకు ఊహించగలిగారు. అందువల్లనే ఆ రోజు నుంచే కుట్ర లకు సానబట్టారు. అందువల్లనే కాంగ్రెస్‌తో కుమ్మక్కయి, అక్రమ కేసులు బనాయించారు, అందుచేతనే ఎల్లో మీడియాను ప్రయో గించి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అందుచేతనే ఆనాడే కుటుంబంలో చిచ్చుపెట్టడానికి ఒడిగట్టారు. ఇప్పుడు కూడా ఈ కుట్రలన్నీ ప్రయోగిస్తూ కూటమి తోడ్పాటుతో అడుగులు వేస్తే గెలుపు దక్కకపోయినా, తన కుమారుడికి రాజకీయాల్లో మిగిలి ఉండే చాన్సయినా ఉంటుందని ఆయన ఆలోచనగా ఉంది. అందుకోసమే తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్‌ కాయాన్ని అద్దెకు తీసు కొని, దాని సాయంతో గేమాడేందుకు సిద్ధపడుతున్నారు.

- వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top